Pratidwani: కాలుష్య గండం గట్టెక్కేదెలా? - కాలుష్య గండం గట్టెక్కేదెలా
🎬 Watch Now: Feature Video
Pratidwani: భాగ్యనగరం కాలుష్యగండం ఎదుర్కొంటోంది. అది పాత విషయమే కావొచ్చు. పరిష్కారం కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న సమస్య అదుపులోకి రాకుండా తీవ్రత పెరుగుతుండడమే కొత్తగా కలవర పెడుతున్న పరిణామం. మరి... హైదరాబాద్‌లో నానాటికీ వాయుకాలుష్యం ఎందుకు పెరుగుతోంది. పీసీబీ ప్రచార లోపమా ... వాహనదారుల్లో అవగాహన లేదా.. పాలకుల నిర్లక్ష్యమా.. కారణం ఏదైనా.. అది రాబోయే తరాలకు పెద్ద సంకటంగానే చెప్పుకోవచ్చు. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఇప్పటికే చాలామంది ఆస్తమా వ్యాధికి దగ్గర చేసింది. దీనికి తోడు నీటు కాలుష్యం కూడా ఉండనే ఉంది. నియంత్రించలేని స్థితిలో రోజూ టన్నుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను ఎలా నియంత్రించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ సంచుల దుకాణాలు కాటేదాన్ పారిశ్రామిక వాడలోనే తయారవుతాయన్నది జగమెరిగిన సత్యం. అయినా అధికారులు ఆ దిశగా దృష్టి సారించరు. అప్పుడప్పుడు దాడులు చేసినట్లు హడావుడి సృష్టించడం.. తరువాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం.. ఇది షరామామూలే అని అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెబుతున్న పాలకుల ఆచరణ తీరు మాత్రం అనుమానాలు రేకెత్తిస్తోంది. బలమైన నిర్ణయం తీసుకొని భావితరాలను కాపాడుకోవాల్సిన నేతలు, అధికారగణం.. ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేంటని ముడుచుకుపోవడమే ఈ సమస్యను మరింత ఝటిలం చేస్తోంది. అసలు హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరుగుతూ ఉండడానికి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ - ఎన్‌క్యాప్‌లో నగరం వెనుకంజలో ఉండడానికి కారణాలేమిటి? పీసీబీ, జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో లోపం ఎక్కడ? వాహన కాలుష్యం సరే... పారిశ్రామిక, మిగిలిన కాలుష్య కారకాల కట్టడి ఎలా ఉంది... దిద్దుబాటు చర్యలు ఏం తీసుకుంటే నగరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి అందరికి ఉంది. ఇది కేవలం పాలకులు , అధికారులకు మాత్రమే సంబంధించిన అంశం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహానగరాన్ని కాలుష్య కోరల నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలపై దానిపై ఇవాళ ప్రతిధ్వని అంశంలో చర్చిద్దాం.