లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకుల గర్జన.. సింధూ నదిని దాటి శత్రువులపై దాడి!
🎬 Watch Now: Feature Video
తూర్పు లద్దాఖ్‌లో చైనాను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు.. భారత సైన్యం నిరంతరం వ్యూహాలను రచిస్తూనే ఉంది. కొత్త ఆయుధాలను మోహరించడం సహా ఆధునిక యుద్ధ రీతులను అందిపుచ్చుకుంటోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసిద్ధం చేసుకుంటోంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని 14 వేల 500 కిలోమీటర్ల ఎత్తున ఉండే న్యోమి సైనిక కేంద్రంలో.. భారత బలగాలు తమ పోరాట పటిమను మరింతగా సాన బెట్టుకుంటున్నాయి. భారత్‌లో తయారైన ధనుష్ శతఘ్నులను.. సైన్యం ఇటీవలే ప్రవేశపెట్టింది. యుద్ధక్షేత్రంలో సమర్ధతను చాటుకున్న బోఫోర్స్ శతఘ్నుల సాంకేతిక పరిజ్ఞానం సేకరించి, మరింత ఆధునిక సాంకేతికతలను జోడించి ధనుష్ శతఘ్నులను దేశీయంగా తయారు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో గతేడాదే వీటిని మోహరించారు. 48 కిలోమీటర్ల ఆవల ఉన్న లక్ష్యాలను ధనుష్ శతఘ్నులు తుత్తునియలు చేస్తాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు 114 గన్స్‌ను సైతం సైన్యం చేతికి అందాయి.
బలగాలు వేగంగా కదిలేందుకు ఉపకరించే M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్.. మన బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింతగా ఇనుమడింపజేశాయి. ఈ వాహనాలు లద్ధాఖ్ ప్రాంతంలో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో సాయుధ బలగాలను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్స్‌ను గతేడాది నుంచి సైన్యంలో ప్రవేశపెడుతున్నారు. లద్దాఖ్‌లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నారు. అత్యవసర ఆయుధాల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక అధికారాలతో వీటిని సైన్యం సమకూర్చుకుంది. ఒకేసారి ఆరుగురు జవాన్లను వారి ఆయుధాలతో పాటు.. ఇవి వేగంగా తీసుకుని వెళ్లగలవు. ఎత్తైన ప్రదేశాల్లోనూ వీటిని సులభంగా నడిపే అవకాశముంది.
15 కిలోమీటర్ల పరిధిలోని మనుషులను, 25 కిలోమీటర్ల దూరంలోని వాహనాలను సులువుగా గుర్తించే ఆధునిక నూతన టాటా రజక్ వ్యవస్థ.. సైనిక నిఘాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వ్యవస్థ సాయంతో శత్రువులపై మన జవాన్లు నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. కె-9 వజ్ర స్వయంచాలిత ఆధునిక గన్లను కూడా.. తూర్పు లద్దాఖ్‌లో ప్రవేశపెట్టేందుకు భారత సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. వజ్ర గన్లు కొన్నేళ్లుగా తమ సమర్థను నిరూపించుకున్న నేపథ్యంలో సైన్యం వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మరో 100 వజ్ర గన్లను త్వరలో ఎల్ అండ్ టీ సంస్థ సరఫరా చేయనుంది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు స్పైక్ యాంటీ గైడెడ్ క్షిపణులను తూర్పు లద్దాఖ్‌లో మోహరించారు. మూడోతరం క్షిపణులైన వీటిని ఎమర్జెన్సీ అధికారాలతో సైన్యం కొనుగోలు చేసింది. త్వరలో మేక్ ఇండియా మార్గంలో వీటిని దేశంలోనే తయారు చేయనున్నారు.
తూర్పు లద్దాఖ్‌లో ఆయుధాలను మోహరించడమే కాకుండా.. నిరంతరం వాటితో భారత సైన్యం కసరత్తు చేస్తోంది. టీ-90, టీ-72 ట్యాంకులు, BMP ఇన్‌ఫాంట్రీ పోరాట వాహనాలు ఇండస్ నదిపై భారత బలగాలు పెద్ద ఎత్తున సాధన చేస్తున్నాయి. ఇండస్ నది ప్రవహించే మార్గంలో క్లిష్టమైన లోయల గుండా చైనా సైన్యం దుస్సాహసం చేసి భారత ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ఎలా తిప్పికొట్టాలో భారత సైన్యం కసరత్తు చేస్తోంది. 16 వేల అడుగుల ఎత్తున ట్యాంకులను మోహరించిన కొద్దిపాటి సైన్యాల్లో.. భారత సైన్యం కూడా చేరింది. శత్రుమూకలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సైన్యం తరచూ పంజాబ్‌లో పాకిస్తాన్ సరిహద్దుల వద్ద సన్నాహాల కసరత్తులు చేస్తుంది. అదే తరహాలో..ఇప్పుడు చైనా సైన్యానికి ధీటుగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ట్యాంకులు, ఆధునిక ఆయుధాలతో డ్రిల్స్ నిర్వహిస్తోంది. భారత సైన్యం డ్రిల్స్ చూస్తే నిజమైన యుద్ధం జరుగుతుందా అనే రీతిలో కనిపిస్తోంది.