మందుకొట్టి పాముతో ఆట.. కాటేయగానే 'మృతి'.. అంత్యక్రియల వేళ లేచి కూర్చుని.. - పాము వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక.. గడగ్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. అతడు కొంత దూరం నడిచి నేలపై కుప్పకూలాడు. పాము కాటు వల్ల ఆ వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే?
గడగ్ జిల్లాలోని హిరేకొప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద స్థానికులకు పాము కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప బలగనూర్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఘటనాస్థలికి వచ్చి ఆ పామును పట్టుకున్నాడు. తన చేతిలో గరుడ రేఖ ఉందని.. తనను పాము కాటు వేయదని అన్నాడు సిద్ధప్ప. అందుకే ఆ పామును ఊరికి దూరంగా వదిలేస్తానని చెప్పి.. చేతితో పట్టుకున్నాడు. మొదట ఆ పాము.. సిద్ధప్పను కాటేయలేదు. ఆ తర్వాత సిద్ధప్ప చేతిలో నుంచి పాము జారిపోయింది. మళ్లీ పామును పట్టుకున్నాడు. అప్పుడు సిద్ధప్పను నాలుగు సార్లు కాటేసింది. అప్పుడు కొంత దూరం నడిచి సిద్ధప్ప కుప్పకూలిపోయాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు.. పాము కాటేయడం వల్ల మరణించాడని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అప్పుడు సిద్ధప్ప ఒక్కసారిగా లేచి కూర్చొన్నాడు. దీంతో అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే సిద్ధప్పను హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆస్పత్రికి తరలించారు.