తల్లి కోసం తల్లడిల్లిపోయిన చిన్నారి - జైలు వద్ద వెక్కివెక్కి ఏడుస్తూ ఎదురుచూపులు - Daughter cries for mother at prison
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 12:03 PM IST
Daughter Cried for Mother at Women Sub Jail: అమ్మ ఏం చేసిందో ఆ చిన్నారికి తెలియదు. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు. తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. అమ్మను చూడాలని, మాట్లాడాలని వెక్కివెక్కి ఏడుస్తున్న బంగారు తల్లిని చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. జైలు గోడకు అటుగా ఉన్న తల్లి కోసం జైలు ముందు నిలబడి, అమ్మా అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.
కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన దృశ్యమిది. పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండుకు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది. స్థానికుల విజ్ఞప్తితో జైలు అధికారులు ఆ తల్లిని బయటికి పిలిపించి కుమార్తెను కలిపించారు. కొద్దిసేపు చిన్నారిని లోపలికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువుల ద్వారా ఆ చిట్టితల్లిని జైలు అధికారులు ఇంటికి పంపించివేశారు.