కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి- రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమేనట! - గోండ్ గిరిజన గౌరీపూజ
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 5:03 PM IST
Chhattisgarh CM Gaura Gauri Puja : ఛత్తీస్గఢ్ ప్రజల శ్రేయస్సు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. కొరడా దెబ్బలు తిన్నారు. దుర్గ్ జిల్లాలోని జాంజ్గీర్ గ్రామంలో ఘనంగా జరిగిన 'గౌరా గౌరీ' పూజకు హాజరైన బఘేల్.. ఆచారంలో భాగంగా కొరడా ఝులిపించుకున్నారు. ఆ సమయంలో అక్కడికి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ఈ పని చేసినట్లు సీఎం బఘేల్ తెలిపారు. "శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. 'గౌరా గౌరీను ప్రజలంతా కలిసి తయారు చేస్తారు. ఉదయాన్నే పూజిస్తారు. గౌరా గౌరీ ముందు అందరూ సమానమే. ఈ పండుగ సమానత్వాన్ని సూచిస్తుంది" అని బఘేల్ తెలిపారు.
దీపావళి పండుగ సమయంలో గోండు తెగ ప్రజలు ఈ పూజను నిర్వహిస్తారు. మొదట నది ఒడ్డుకు వెళ్లి మట్టిని సేకరిస్తారు. అదే రోజు రాత్రి ఒకరి ఇంట్లో శివుడిని.. మరొకరి ఇంట్లో పార్వతీ దేవిని తయారు చేస్తారు. అనంతరం శివపార్వతుల కల్యాణ జరుపుతారు.
ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా.. నవంబర్ 7వ తేదీన 20 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలి 70 స్థానాలకు నవంబర్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.