ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రధాని పర్యటన : కేకే
MP Keshavrao on PM Modi Hyderabad Tour : రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటనను రాజకీయ కార్యక్రమంగా మార్చివేయటం సరైందికాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ఆహ్వానితుల జాబితాలో ఎంపీల పేర్లు ఉంటాయని.... ప్రస్తుతం అవి ఎక్కడా లేవని చెప్పారు. అధికారిక కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా రెండింటినీ కలిపి రాజకీయ వేదికగా మార్చుకోవటం బాధాకరమని అన్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రస్తుత ప్రధాని కార్యక్రమం ఉందని ధ్వజమెత్తారు
'ఎప్పుడైనా ప్రధాని హైదరాబాద్కు వస్తే, ఏదైనా జాతీయ కార్యక్రమం జరిగితే ఎంపీల పేరు కార్డులో ఉంటుంది. ఇది పద్ధతి.. ప్రొటోకాల్.. కానీ ఈసారి ఏదైతే ఇన్విటేషన్ కార్డు మాకు వచ్చిందో అందులో ఏ ఎంపీ పేరు లేదు. రాజకీయం గురించి చేస్తున్నారో అనే అనుమానం నాకు వచ్చింది. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన రాజకీయ కార్యక్రమంగా మారింది. ప్రధాని పర్యటన ఆహ్వానితుల జాబితాలో ఎంపీల పేర్లు ఎక్కడా లేవు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రధాని పర్యటన తీరు ఉంది. ప్రధాని పర్యటన తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాను.' అని కె.కేశవరావు వ్యాఖ్యానించారు.