Bogatha Waterfall : మనోహరంగా తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం అందం చూడతరమా..? - BOGATHA WATERFALLS IN MULUGU DISTRICT
🎬 Watch Now: Feature Video
Bogatha Waterfall Video: ములుగు జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలంలోని తెలంగాణ నయాగారా బొగత జలపాతం జాలువారుతోంది. కొన్ని నెలలుగా బోసిపోయిన బొగత జలపాతం ఇటీవలే కురుస్తున్న వర్షాలకు కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. పెనుగోలు అడవి ప్రాంతంలో కొండ కోనలు, వాగులు, వంకల నుంచి జలధార ప్రవహిస్తూ జలపాతం వద్ద 50 ఫీట్ల ఎత్తుతో జాలువారుతూ మైమరిపిస్తోంది.
కొండల పైనుంచి దూకుతున్న పాలనురగ వంటి జలధారలు కనువిందు చేస్తున్నాయి. ఈ జలపాతాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం వద్ద అటవీశాఖ అధికారులు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పరిసరాలు కోలాహాలంగా మారాయి. కొత్త అందాలతో తెలంగాణ నయాగారా చూపరులకు ఎంతగానో కనువిందు చేస్తోంది.