ఈ నెల 29, 30న 'ఛలో దిల్లీ' - పార్లమెంట్ ముందు బీసీ నాయకుల ధర్నా : ఆర్.కృష్ణయ్య - BC Leader Demand in Delhi
🎬 Watch Now: Feature Video


Published : Jan 5, 2024, 6:34 PM IST
BC protest at Delhi : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణన, కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29, 30న 'ఛలో దిల్లీ' పేరిట పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఛలో దిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 14 బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని గత 30 ఏళ్లుగా దిల్లీలో 102 సార్లు ధర్నా చేశామని గుర్తు చేశారు. 66 సార్లు బీసీ బిల్లుపై బీసీ నాయకులు ప్రధాన మంత్రులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన చేపట్టి, బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇస్తారని ఆయన అన్నారు. కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు అమనిని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.