Asifabad Bridge Issue : వంతెన లేక నిత్యం వెతలే.. వాగు దాటాలంటే చాలు గుండెల్లో గుబులే!
🎬 Watch Now: Feature Video
Asifabad Latest News : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన లక్మాపూర్ తండా వాసులకు వంతెన లేకపోవడంతో కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. లక్మాపూర్ వాగుపై 2016లో వంతెన పనులకు శ్రీకారం చుట్టి మధ్యలోనే ఆపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వంతెన పనులు కాకపోవడంతో అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని వాగు దాటుతున్నారు. తరాలు మారిన తలరాతలు మారటం లేదు. రాజకీయ నాయకులు మారిన వంతెన పూర్తి కాకపోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దేవీదాస్(45)కు జులై 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. చికిత్స చేసి రాడ్ వేశారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి అతన్ని ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాయిదా వేసుకున్నారు. బుధవారం నీటిమట్టం తగ్గడంతో మంచంపై అతన్ని ఉంచి.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వాగును దాటించారు. రోజులో రెండుసార్లు ఇలా వాగును దాటించగా.. దేవీదాస్ ఆదిలాబాద్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుని తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తి చేసి తమను ఇబ్బందులు నుంచి గట్టెక్కించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.