'అంత మంచి వ్యక్తిని జైలులో ఎలా పెట్టారు?'.. సిసోదియాను తలచుకుని కేజ్రీవాల్ ఎమోషనల్
🎬 Watch Now: Feature Video
Arvind Kejriwal Emotional : దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను తలచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దిల్లీలోని బవానాలో బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌లెన్స్ నూతన శాఖను బుధవారం.. కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్య కోసం.. సిసోదియా చేసిన పనులను ఆయన గుర్తుచేశారు. తప్పుడు కేసులో సిసోదియాను.. జైల్లో పెట్టారని ఆరోపించారు. దేశంలో తాము ఎక్కడికి వెళ్లినా దిల్లీలో పేద పిల్లలకు మంచి విద్య అందుతోందనే ప్రశంసలు వినిపించాయని సీఎం అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి దేశంలో వస్తున్న ఆదరణ తట్టుకోలేకే.. తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. త్వరలోనే సిసోదియా జైలు నుంచి బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యమే ఎప్పుడూ గెలుస్తుందని కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు.
'ప్రతి చిన్నారికి ఉత్తమ విద్య అందాలని మనీశ్ సిసోదియా కల కన్నారు. అసత్య ఆరోపణలతో అంత మంచి వ్యక్తిని ఇన్ని నెలలు జైలులో పెట్టారు. ఆయన్ను ఎందుకు జైలులో పెట్టారు? దేశంలో పెద్ద పెద్ద దొంగలు బయట తిరుగుతున్నారు. వాళ్లను పట్టుకోవడంలేదు. పిల్లలకు ఉత్తమ విద్య అందాలని మంచి పాఠశాలలు నిర్మించినందుకు ఆయన్ని జైలులో పెట్టారు. మీ కోసం విద్యా వ్యవస్థపై మనీశ్ సిసోదియా పనిచేయకుండా ఉండి ఉంటే ఆయన జైలుకు వెళ్లేవారు కాదు. మేము ఆయన కలను నెరవేరుస్తాం. ఆయన చేపట్టిన ఈ మంచి పనిని ఆపేదిలేదు.' అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు.