ఆ గ్రామంలో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం.. అమ్మినవారికి రూ.50వేలు జరిమానా - మెదక్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
liquor banned in konapur village: మెదక్ జిల్లాలో గ్రామస్థులంతా కలిసి స్వచ్ఛందంగా ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరి స్వార్థం వారు చూసుకునే రోజుల్లో మనమే కాదు మనతో పాటు మన ఊరు కూడా బాగుండాలనే గొప్ప ఆలోచన చేశారు గ్రామపెద్దలు. గ్రామస్థుల బాగుకోసం పెద్దలు గ్రామసభ పెట్టి మద్యపాన నిషేధాన్ని విధించాలని తీర్మానం చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల నాయకులు, యువజనులు, గ్రామస్థులు, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా నేడు గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఇకపై బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని తీర్మానించారు. ఎవరైనా తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్మినట్లయితే వారికి 50 వేల రూపాయల జరిమానా విధించాలని.. అదేవిధంగా ఎవరైనా మద్యం అమ్మేటప్పుడు పట్టించిన వారికి 5000 రూపాయల నజరానా ఇస్తామని తీర్మానం చేశారు.
గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువై విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. గ్రామంలోని కొంతమంది ప్రజలు మద్యం సేవించి వారి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారని.. అందుకే గ్రామస్తుల బాగుకోసం గ్రామంలో మద్య నిషేధం విధించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. ఇదేగాక ఉమ్మడి రామంపేట మండలంలో ప్రగతి ధర్మారం, బచ్చురాజుపల్లి, కె వెంకటాపూర్, నార్లాపూర్, చల్మడ, గ్రామాలలో ఇది వరకే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయగా అదే తరహాలో కోనాపూర్‌లో మద్యపాన నిషేధం చేశారు.