నన్ను ఆపడానికి ఇంకా ఎవరూ పుట్టలేదు - పోలీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్ - అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 1:02 PM IST
Akbaruddin Owaisi Fires on Police Viral Video : హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రచార సమయం ముగిసిందని.. ఆపి వేయాలని పోలీసులు కోరగా.. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం సంతోశ్నగర్ పీఎస్ పరిధిలో గత రాత్రి 10 గంటల సమయం దాటినా ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ప్రచార సమయం ముగిసిందని.. ప్రసంగాన్ని ముగించాలని సంతోశ్నగర్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర అక్బరుద్దీన్ ఒవైసీకి సూచించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. తన వద్ద కూడా చేతి గడియారం ఉందని.. ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని తెలిపారు. ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ ఇన్స్పెక్టర్పై చిందులు తొక్కారు. తనను ఆపడానికి ఇంకా ఎవరూ పుట్టలేదంటూ స్టేజ్ మీద నుంచే పోలీసులను హెచ్చరించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా.. బీజేపీ స్పందించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలాంటి వారికి బుల్డోజర్ రియాక్షన్ తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు అక్బరుద్దీన్ వీడియోను తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది.