Live Video: పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ మహిళ మృతి - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
మరణం ఎప్పుడు, ఎలా ఎవరిని పలుకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే చావుకు లేత, ముదురు అనే వాటితో సంబంధం ఉండదంటారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపి చూస్తుండగానే మృత్యుఒడిలోకి జారుకుంటూ ఉంటారు. తీవ్రవిషాదాన్ని నింపే ఈ తరహా ఘటన తాజాగా ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం శివారులోని అల్లిపురానికి చెందిన 30ఏళ్ల వయసున్న రాణి బంధువుల వివాహ వేడుకలకు వెళ్లింది. చింతకాని మండలం సీతంపేట గ్రామంలో గురువారం జరిగిన వివాహంలో కుటుంబసభ్యులు, బంధువులతో ఆమె ఎంతో ఆనందంగా గడిపింది. పెళ్లికుమార్తె అప్పగింతల అనంతరం ఆటాపాటలతో సాగనంపుతున్నారు. అప్పటి వరకు బంధువులతో నవ్వుతూ ఆడుతూ ఉన్న రాణి ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే బంధువులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లి వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న మహిళ ఆటాపాటల మధ్యలోనే తమ నుంచి దూరం కావటంతో ఆ పెళ్లింట తీవ్రవిషాదం నెలకొంది. ఊరేగింపు సమయంలో ఏర్పాటు చేసిన డీజే శబ్దాల కారణంగానే రాణి మృతిచెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.