2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్‌లో రూ.2.36 కోట్లు సీజ్ - కరీంనగర్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 10:39 PM IST
2 Crore Money Seize in Karimnagar : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు అనుగుణంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులమేరకు నియమావళిని పాటించడంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎక్కడిక్కడే తనిఖీలు ముమ్మరం చేస్తూ.. భారీగా బంగారం, నగదు పట్టుబడుతుంది. కరీంనగర్‌లో వాహనాల తనిఖీల సందర్భంగా ఇవాళ భారీ మొత్తంలో నగదు పట్టుబడినట్లు కరీంనగర్ పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు తెలిపారు.
నగరంలోని ఐబీ గెస్ట్ హౌస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వాహనంలో రూ. 2.36 కోట్లకు పైగా నగదును గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సరైన ఆధారాల పత్రాలు చూపకపోవడం వల్ల ఆ నగదును స్వాధీనం చేసుకొని రిటర్నింగ్ అధికారితో పాటు ఆదాయపు పన్ను శాఖాధికారులకు సమాచారం ఇచ్చినట్లు సీపీ వివరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమ సొమ్ము, మద్యం, గోల్డ్, ఇతర వస్తువులను అరికట్టేందుకు పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.