Vaikunta Dwadasi 2025 : తిరుమల గిరుల్లో వెలసిన పవిత్ర తీర్థాలకు ఏడాదికోసారి ముక్కోటి వస్తుంది. వైకుంఠ ఏకాదశి మరుసటిరోజు వైకుంఠ ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీవారి పుష్కరిణి తీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. ద్వాదశి స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్రస్నానం ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణి యందు ధనుర్మాసము, శుద్ధ ద్వాదశి రోజు, అరుణోదయ కాలం నందు ఆరు ఘడియలు సమయం అత్యంత శుభ సమయంగా భావిస్తారు. అందుకే ఈ శుభ సమయంలో శ్రీవారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి స్నాన మహత్యం, శ్రీవారి పుష్కరిణి విశిష్టత తెలుసుకుందాం.
శ్రీవారి పుష్కరిణి విశిష్టత
శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానం చేసి, స్వామి దర్శనానికి వెళ్లాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చే వేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన.
సకల పాపనాశిని శ్రీవారి పుష్కరిణి
సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యా దోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలో కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు వచ్చి కలుస్తాయి. పూర్వం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసిన పుణ్య జలాలు కూడా వచ్చి స్వామి పుష్కరిణిలో కలిసేవని చెప్తారు.
శ్రీవారి పుష్కరిణి స్నాన మహత్యం
భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునే ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం దక్కుతుంది, పవిత్ర గంగానదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తారు. ముఖ్యంగా ధనుర్మాస ద్వాదశిని ముక్కోటి ద్వాదశి అంటారు. ఈ రోజున స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అంతకుమించిన పుణ్యం లేదు అంటారు.
త్వరలో రానున్న వైకుంఠ ద్వాదశి రోజు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి సకల పాపాలను పోగుట్టుకుందాం.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.