10 Feet Long Python Viral Video : వలలో చిక్కిన 10 అడుగుల కొండచిలువ.. అంతా హడల్!
🎬 Watch Now: Feature Video
10 Feet Long Python Viral Video : చేపలు పట్టేందుకు నదిలోకి ఓ వ్యక్తి విసిరిన వలలో భారీ కొండచిలువ పడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మత్స్యకారులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బిహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అసలేమైందంటే?
జిల్లాలోని నువాన్ బ్లాక్.. పంజ్రావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు.. చేపలు పట్టేందుకు కర్మనాశా నదికి శనివారం ఉదయం వెళ్లారు. ఆ సమయంలో ఓ మత్స్యకారుడు.. చేపలు పట్టేందుకు నదిలోకి వల విసిరాడు. ఆ తర్వాత వలను బయటకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా అనిపించింది. పెద్ద సంఖ్యలో చేపలు పడ్డాయేమోనని అతడు చాలా ఆనందపడ్డాడు.
తీరా వల బయటకు లాగాక.. అందులో ఉన్న పది అడుగుల కొండ చిలువను చూసి అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని కొండచిలువను రక్షించారు. అనంతరం అడవిలోకి విడిచిపెట్టారు.
అయితే ఎక్కడైనా పాము కనిపిస్తే చంపవద్దని అటవీ శాఖ బృందం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీనిపై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించమని కోరింది.