నరేశ్-పవిత్ర 'పెళ్లి వీడియో' రిలీజ్.. ఆశీస్సులు కావాలంటూ పోస్ట్.. కానీ అసలు కథ వేరే! - నరేష్ పవిత్ర ట్వీట్
🎬 Watch Now: Feature Video
నటుడు నరేశ్.. నటి పవిత్ర కొద్ది రోజులుగా వార్తల్లో బాగా నిలుస్తున్నారు. తాజాగా ఈ జంట మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సారి మాత్రం మాములుగా రాలేదు. ఏకంగా పెళ్లి వీడియోతోనే వచ్చారు. పవిత్రను పెళ్లి చేసుకున్నానని నరేశ్.. ట్విట్టర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. తమ కొత్త ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా సాగడానికి.. ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు నరేశ్ తెలిపారు. పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ పేర్కొన్న నరేశ్.. 'పవిత్రనరేష్' హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ వీడియో విడుదల చేశారు.
అయితే ఈ పెళ్లి వీడియో ఓ ప్రముఖ దర్శకుడు నిర్మిస్తున్న కొత్త సినిమాలోనిది అని తెలుస్తోంది. కొంతకాలంగా పవిత్రతో కలిసి ఉంటున్న నరేశ్.. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కూడా సినిమా వీడియోనేనని సమాచారం. తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేందుకే నరేశ్ సినిమా వీడియోలను ట్విట్టర్ ద్వారా బహిరంగంగా విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సంవత్సరన్నర కిందటే నరేశ్-పవిత్ర.. కొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని సమాచారం. తమ వ్యవసాయ క్షేత్రంలోనే ఈ వివాహం జరిగిందనే విషయం చిత్రపరిశ్రమలో వినిపిస్తోంది. అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన విడాకుల కేసులు కోర్టులో ఉన్న కారణంగా.. అధికారికంగా ఎక్కడా పెళ్లి చేసుకున్నామని చెప్పడం లేదని తెలుస్తోంది. అందుకే నరేశ్.. ట్విట్టర్ ద్వారా పవిత్రతో పెళ్లికి సంబంధించి వీడియోలను విడుదల చేస్తూ తన వైవాహిక బంధాన్ని అధికారికంగా ప్రకటించినట్లు చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది.