యోగా మనల్ని శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢపరుస్తుంది. మరి ఆందోళనను తరిమే ఆసనాలు.. ప్రశాంతతను చేకూర్చే చిట్కాలపై ఓ లుక్కేయండి..
ఇలా చేస్తే ఆందోళనలు దూరం!
ఒత్తిడి, భయం, ఆందోళన.. ఏదో ఒక విషయంలో మనం కూడా ఈ ఫీలింగ్స్‌ని ఎదుర్కొంటుంటాం. ఇది ఎప్పుడో ఓసారి అయితే పర్లేదు.. కానీ కొంతమంది ప్రతిదానికీ భయపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు.. రోజూ ఒత్తిళ్ల మధ్యే గడుపుతుంటారు. ఇలాంటి పరిస్థితే గనుక కొన్నాళ్ల పాటు కొనసాగినట్లయితే.. అది క్రమంగా యాంగ్జైటీ డిజార్డర్‌కు దారితీసే ప్రమాదముందంటున్నారు మానసిక నిపుణులు. అయితే ఈ మానసిక సమస్యను జయించడానికి యోగాను మన జీవన విధానంలో భాగం చేసుకోవడంతో పాటు మరిన్ని నియమాలు పాటించాలని వారు సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటంటే..!
ఈ ఆసనాలతో ఆనందంగా..!
మన మనసులోని ఆందోళనలు, ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసి ఆనందాన్ని, మానసిక ఆరోగ్యాన్ని అందించే శక్తి యోగా సొంతం. అందుకు కొన్ని యోగాసనాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా మత్స్యాసనం, సేతు బంధాసనం, మార్జాలాసనం, శీర్షాసనం.. వంటి యోగాసనాలు మంచి ఫలితాలు అందిస్తాయి. ఇలా ఏ యోగాసనం చేసినా.. ఆ సెషన్ పూర్తయ్యాక కొన్ని నిమిషాల పాటు యోగ నిద్రలోకి వెళ్లడం వల్ల శరీరం, మనసు రిలాక్సవుతుంది. అంతేకాదు.. ఈ యోగాసనాల వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి అటు ఆరోగ్యం, ఇటు మానసిక ప్రశాంతత లభిస్తాయి. అయితే తొలిసారి యోగాసనాలు సాధన చేస్తున్న వారు మాత్రం మరీ కఠినమైనవి కాకుండా కాస్త సులభమైన ఆసనాలు ఎంచుకోవడం మంచిది. ఈ క్రమంలో బోలెడన్ని యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్తూ నెమ్మదిగా, జాగ్రత్తగా ఆసనాలు ప్రాక్టీస్ చేయచ్చు.
ఇతరుల గురించి కూడా ఆలోచించండి!
‘నేను, నా వాళ్లు, నా వస్తువులు’.. అంటూ మనలో చాలామంది ఎప్పుడు చూసినా వీటి చుట్టూనే తిరుగుతుంటారు. అయితే మనలోని ఆందోళనల్ని దూరం చేసుకోవాలంటే ఇలాంటి స్వార్థపూరిత జీవితం నుంచి కాస్త బయటకొచ్చి ఇతరుల గురించి కూడా ఆలోచించమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మన గురించే, మనకు సంబంధించిన విషయాల గురించే ఆలోచించడం వల్ల మన ఆందోళనలకు మూలమైన విషయాలే మనకు పదే పదే గుర్తొచ్చి మానసికంగా మరింత కుంగదీస్తాయి. అదే.. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, మనకు తోచినట్లుగా సహాయపడడం వల్ల మనం పొందే ఆనందం, సంతృప్తి అనుభవిస్తేనే అర్థమవుతుంది. తద్వారా ఒత్తిడి కలిగించే విషయాల గురించి ఆలోచించకుండా సంతోషంగా గడపచ్చు.. అంతేకాదు.. ఇలాంటి పనులు మనసును ఉత్సాహపరచడంతో పాటు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
ప్రార్థన మంచిదే!
‘ఉదయం ఈ హడావిడిలో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే సమయముండదు.. ఇంకా ప్రార్థన ఏం చేస్తాంలే..’ అనుకోవద్దు.. రోజూ ఉదయం కాసేపు దైవ ప్రార్థన చేయడం, దేవుడికి సంబంధించిన పాటలు పాడడం లేదా వినడం.. వంటివి చేయడం వల్ల మనసులో ఉన్న ఏ చెడు ఆలోచనలైనా హుష్‌కాకి అయిపోవాల్సిందే! ఇలాంటి ప్రార్థనల వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తవుతుంది.. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే మనపై మనకు నమ్మకం పెరగడానికి, మనం రోజంతా సంతోషంగా, ఉత్సాహంగా గడపడానికి కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. కావాలంటే.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..! మీకే అర్థమవుతుంది.
‘పాజిటివిటీ’ని పెంచుకోండి!
మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది మనల్ని చూసి అసూయ పడే వారు, మనల్ని నిరుత్సాహ పరిచే వారే ఉంటారు. ఇక మనం ఆందోళనలతో సతమతమయ్యే సమయంలోనూ అలాంటి ప్రతికూల వాతావరణంలోనే ఉండడం వల్ల మన సమస్య మరింత రెట్టింపవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ సమస్యను మీలోనే దాచుకోకుండా మీ మేలు కోరే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పంచుకోవాలి. అప్పుడే మీ గుండె భారం తగ్గడంతో పాటు మీ సమస్యకో పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో పనిచేస్తున్నా మీ చుట్టూ మీ మనసుకు ఆహ్లాదాన్ని పంచే బొమ్మలు, మొక్కలు, రంగులు, ఇతర వస్తువులు.. వంటివి అందంగా అలంకరించుకోవడం వల్ల నెగెటివిటీని దూరం చేసుకొని పాజిటివిటీని పెంచుకోవచ్చు.
ఒంటరిగా వద్దు..
ఒంటరితనం మనలోని ప్రతికూల ఆలోచనల్ని రెట్టింపు చేస్తుంది. కరోనా వచ్చిన దగ్గర్నుంచి చాలామందిలో ఒత్తిడి, ఆందోళనలకు ఇదీ ఓ కారణమే! వైరస్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే లాక్‌డౌన్ అయిపోవడం, వృత్తిరీత్యా, ఇతర పనుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో ఒత్తిడి, ఆందోళనలు, ఏదో తెలియని భయం మనల్ని వెంటాడుతుంటుంది. అంతేకాదు.. గతంలో మన జీవితంలో జరిగిన చెడు సంఘటనలు, అనవసర విషయాలు గుర్తొచ్చి మరింత ఆందోళన చెందుతాం. ఇదిలాగే కొనసాగితే తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఒంటరిగా ఉండడం కంటే తెలిసిన స్నేహితుల ఇళ్లలో ఉండడం, ఒకవేళ అదీ వీలుకాకపోతే సెలవు రోజుల్లో మీ బంధువులిళ్లకు వెళ్లడం, రోజూ మీ వాళ్లతో వీడియో కాలింగ్ ద్వారా టచ్‌లో ఉండడం.. ఇలా ఆలోచిస్తే బోలెడన్ని ఆప్షన్లున్నాయి. అయితే ఇతరుల ఇళ్లలో ఉన్నప్పుడైనా, బయటికి వెళ్లినప్పుడైనా.. మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలన్న విషయం మాత్రం విస్మరించద్దు. తద్వారా కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడడంతో పాటు ఒంటరితనాన్నీ జయించచ్చు. అలాగే మానసిక ఆందోళనల్నీ దూరం చేసుకోవచ్చు.
చూశారుగా.. మనసులోని ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో! కాబట్టి వీటిని ఫాలో అయిపోయి ఈ మానసిక రుగ్మతకు చెక్ పెట్టేద్దాం.. రోజూ ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడిపేద్దాం.. ఈ చిట్కాల్ని ఇతరులతో పంచుకుంటూ వారిలోనూ సానుకూల దృక్పథాన్ని నింపేద్దాం..!
ఇదీ చదవండి:పిల్లలు బరువు పెరగాలంటే ఇలా చేయాలి