రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడవాలా..? మనసు ప్రశాంతంగా ఉండాలా..? మేను మెరిసిపోవాలా..? ఆరోగ్యమూ కావాలంటారా..? అయితే ఉదయం లేవగానే ఈ యోగాసనాలు వేయడానికి ప్రయత్నించండి. అన్నీ మీ సొంతమవుతాయి.
ధ్యానం:
ఐదు నిమిషాలపాటు కళ్లు మూసుకుని ధ్యానం చేయండి. ఇలా రోజూ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.
చైల్డ్ పోజ్:
మ్యాట్‌పై మోకాళ్లను మడిచి పాదాలు పిరుదులను తాకేలా కూర్చోవాలి. ముందుకు వంగి చేతులు, తలను భూమికి తాకిస్తూ గాలి పీల్చుకోవాలి. ఈ స్థితిలో మీరు ఉండగలిగనంత సేపు ఉండాలి. ఆ తర్వాత పైకి లేచే క్రమంలో గాలిని బయటకు వదలాలి. ఇలా కనీసం ఐదు నుంచి పదిసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది. చర్మం కాంతులీనుతుంది.
క్యాట్ కౌ:
రెండు కాళ్లను మోకాలి వరకు మడవాలి. చేతులను నిటారుగా ఉంచి భూమికి తాకించాలి. కిందకు చూస్తూ గాలి పీలుస్తూ, పొట్టను లోపలివైపునకు లాగాలి. ఇప్పుడు గాలి వదులుతూ తలను పైకి లేపాలి ఇలా 20 సార్లు చేయాలి.
ఈ ఆసనం వేయడం వల్ల మెడ, భుజాలు, వెన్ను కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. నాడులు ఉత్తేజంగా మారతాయి. చాలాసేపు కూర్చొని పనిచేసేవారు దీన్ని ప్రయత్నిస్తే మంచిది.
ఇదీ చూడండి.. కళ్ల పరిరక్షణ కోసం ఇలా చేయండి!