World Health Day 2022: పర్యావరణంతోనే మన జీవన పయనం! దీంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. పర్యావరణం కలుషితమైతే ఆరోగ్యమూ చిక్కుల్లో పడటం ఖాయం. ఇప్పటికే దీని అనర్థాలను అనుభవిస్తున్నాం. ఇది ఊపిరితిత్తుల సమస్యలకే కాదు.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, కాలేయ కొవ్వు, క్యాన్సర్ల వంటి జబ్బులకూ కారణమవుతుండటం గమనార్హం. ఇలాంటి సాంక్రమికేతర జబ్బులకు జీవనశైలే ప్రధాన కారణమని భావిస్తుండగా ఇప్పుడు కాలుష్యమూ వీటిని ఉద్ధృతం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టే ప్రపంచ ఆరోగ్య దినం 'మన గ్రహం, మన ఆరోగ్యం' అని నినదిస్తోంది. కాలుష్యం నుంచి భూమిని కాపాడుకోకపోతే మన ఆరోగ్యం వేగంగా ప్రమాదంలో పడటం ఖాయమని అన్యాపదేశంగా హెచ్చరిస్తోంది.
"గాలి అందరికీ ఉచితమే గానీ కలుషితమైతే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చెడు నీటి కన్నా చెడు గాలి ఎక్కువ హాని చేస్తుందని డాక్టర్లు చెబుతారు. చెడు గాలిని పీల్చుకోవటం హానికరం. మనం (కొన్నిసార్లు) గాలిని మార్చుకోవాల్సిన అవసరముందనటానికి ఇదొక కారణం" -మహాత్మా గాంధీ 1918లో అహ్మదాబాద్ సమావేశంలో ఇచ్చిన సందేశమిది. పర్యావరణ సమస్యల ప్రస్తావన లేని రోజుల్లోనే, 104 ఏళ్ల కిందటే ఆయన భవిష్యత్ పరిస్థితిని అంచనా వేశారనటానికిది చక్కటి నిదర్శనం. అదిప్పుడు నిజమవుతోంది కూడా. మనదేశంలో అకాల మరణాల్లో 30% మరణాలకు గాలి కాలుష్యమే కారణమవుతున్నట్టు 'సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్' నివేదిక ఒకటి పేర్కొంటోంది. పర్యావరణ కాలుష్యం మూలంగా ఏటా 1.3 కోట్ల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇవన్నీ పూర్తిగా నివారించుకోగదగినవే కావటం గమనార్హం.
కాలుష్య జబ్బులు ప్రత్యేకం.. జబ్బులను ప్రధానంగా ఇన్‌ఫెక్షన్లు, పోషణ సమస్యలు, జీవనశైలితో తలెత్తేవి, క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, వృత్తి/పర్యావరణంతో ముడిపడినవి.. ఇలా ఆరు రకాలుగా వర్గీకరించొచ్చు. వీటిల్లో కాలుష్యంతో తలెత్తే జబ్బులు ప్రత్యేకమనే చెప్పుకోవాలి. నిజానికి జబ్బులన్నింటికీ నివారణ మార్గాలున్నాయి. ఒకవేళ వచ్చినా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ వృత్తి/పర్యావరణ, కాలుష్య సంబంధ జబ్బులకు మాత్రం చికిత్స లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మంచి విషయం ఏంటంటే- వీటిని నూటికి నూరు శాతం నివారించుకునే వీలుండటం. వ్యక్తిగత పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ, అవసరమైతే మాస్కుల వంటి రక్షణ పరికరాలు ధరించటం, కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించటం ద్వారా వీటిని పూర్తిగా అడ్డుకోవచ్చు. అందువల్ల కాలుష్య విపరీత పరిణామాలు, వీటితో ముంచుకొచ్చే సంబంధ జబ్బుల మీద అంతా అవగాహన కలిగుండటం అవసరం.
ప్రభావం రెండు రకాలు.. కాలుష్య ప్రభావాన్ని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. గనులు, పరిశ్రమల వంటి వాటిల్లో పని చేసేవారు అక్కడి కాలుష్య ప్రభావానికి గురికావొచ్చు. ఇది వృత్తులతోనే ముడిపడి ఉంటుంది. దీని గురించి అక్కడ పనిచేసేవారికి, యాజమాన్యాలకు స్పష్టంగా తెలుసు. ఎలాంటి ముడి పదార్థాలతో పనిచేస్తున్నారు? వాటితో తలెత్తే అనర్థాలేంటి? అనే వాటిపై ముందే అవగాహన ఉంటుంది. వీటికి ఆయా చోట్ల పనిచేసేవారు మాత్రమే, ఆయా పనివేళల్లోనే ప్రభావితం అవుతారు. కాబట్టి కాలుష్య నియంత్రణ, రక్షణ మార్గదర్శకాలను పాటిస్తే అనర్థాలను పూర్తిగా నివారించుకోవచ్చు. కానీ పర్యావరణ కాలుష్యం తీరు వేరు. పనులతో దీనికి సంబంధం సంబంధం లేదు. పారిశ్రామిక ప్రాంతాల్లో గానీ మిగతా చోట్ల గానీ ఎక్కడ నివసిస్తున్నా సరే.. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా దీనికి గురవ్వచ్చు. ఏయే కాలుష్య కారకాలకు గురవుతున్నామనే సంగతి ఎవరికీ తెలియదు. పైగా వీరిలో అందరూ ఆరోగ్యవంతులే కాకపోవచ్చు. ఇతరత్రా జబ్బులూ ఉండొచ్చు. జబ్బులకు తోడు నిరంతరం కాలుష్య ప్రభావానికి గురవ్వటం మరింత విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
క్రీస్తు పూర్వమే.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌గా నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా విస్మృత మహనీయులనూ స్మరించుకుంటున్నాం. కాలుష్యం విషయంలోనూ మనం తలచుకోవాల్సిన మహనీయులు లేకపోలేదు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది కౌటిల్యుడి గురించి. ఆయన క్రీ.పూ. 375లోనే అర్థశాస్త్రంలో వృత్తులతో, పర్యావరణ ప్రభావాలతో వచ్చే జబ్బుల గురించి ప్రస్తావించారు. ఆరోగ్య బడ్జెట్‌ను రూపొందిస్తూ సాధారణ ఆరోగ్యంతో పాటు పర్యావరణ/పారిశుద్ధ్య ఆరోగ్యం, గనులు తవ్వేవారి ఆరోగ్యం కోసమూ విడిగా పద్దులు కేటాయించారు. ఇవి వృత్తిపరంగా, పర్యావరణ పరంగా తలెత్తే జబ్బుల కోసం ఉద్దేశించినవే. ఇలా మనదేశం ఎవరూ ఆలోచించని రోజుల్లోనే ప్రపంచానికి కొత్త ఆరోగ్య దృక్పథాన్ని కలిగించింది. మరో మహనీయుడు స్వర్గీయ డాక్టర్ ఎం.ఎన్.రావు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో చదివిన ఆయన 1945లో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రజారోగ్యం మీద డాక్టరేట్ చేశారు. కోల్‌కతాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ మొట్టమొదటి డైరెక్టర్‌గా నియుక్తులయ్యారు కూడా. వృత్తిపర జబ్బుల విషయంలో ఎనలేని కృషి చేశారు. రిటైర్ అయ్యాకా పలు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల బోర్డుల్లో కొనసాగారు.
జబ్బులు రకరకాలు.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కాలేయ జబ్బుల వంటి సమస్యలకు ఎలాంటి పరిశ్రమలు, ఏయే కాలుష్య కారకాలు, ముడి పదార్థాలు దోహదం చేస్తున్నాయనేది మనకు కచ్చితంగా తెలియదు. దీనిపై మనదగ్గర పెద్దగా అధ్యయనాలు జరగలేదు. పరిశ్రమల్లో గానీ బయట గానీ కాలుష్య ప్రభావాలపై అంత సమాచారం అందుబాటులో లేదు. కానీ విదేశాల్లో విస్తృతంగానే అధ్యయనాలు సాగాయి. కాలుష్యంతో జీవనశైలి జబ్బులు పెరుగుతున్నాయని ఇవి విస్పష్టంగానే పేర్కొంటున్నాయి. జీవనశైలితో ముడిపడిన జబ్బులకు కాలుష్యం ఎలా కారణమవుతుంది? కాలుష్యం కూడా అస్తవ్యస్త జీవనశైలి మాదిరిగానే ఒంట్లో కణస్థాయిలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపితమయ్యేలా చేస్తుండటమే! ఉదాహరణకు గాలిలోని నుసి(పార్టిక్యులేట్ మ్యాటర్)నే చూడండి. ఇది మనకు తెలియకుండానే మన రక్షణ వ్యవస్థను చేధించుకొని ఒంట్లోకి వెళ్తుంది. 2.5 మైక్రాన్ల సైజు నుసి గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉంటుంది. ఇది శ్వాస ద్వారా తేలికగా ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరుకుంటుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి అయ్యే గాలిగదుల వరకూ చొచ్చుకుపోవచ్చు. కాలుష్య కారకం ఎక్కువసేపు అక్కడే ఉండిపోతే రసాయనాలు విడుదలై అక్కడి కణజాలం గట్టిపడొచ్చు (ఫైబ్రోసిస్). వాపు ప్రక్రియ ప్రేరేపితం కావొచ్చు. కాలుష్య కారకాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతరత్రా భాగాలకూ చేరుకోవచ్చు. రక్తనాళాల్లో తిష్ఠవేసి లోపలి గోడలను దెబ్బతీయొచ్చు. ఇది పూడికలకు, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటానికి దారితీస్తుంది. దీంతో రక్తపోటు పెరిగి.. క్రమంగా గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఆయా భాగాల్లో వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటం వల్ల కాలేయ ఉబ్బు, క్యాన్సర్ల వంటివీ తలెత్తొచ్చు. వాహనాల నుంచి వెలువడే పొగలోని నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటివి ఇన్సులిన్ నిరోధకత పెరిగేలా చేస్తాయి. దీంతో కణాలు ఇన్సులిన్‌కు స్పందించటం తగ్గుతుంది. ఫలితంగా కణాల్లోకి గ్లూకోజు సరిగా వెళ్లదు. క్రమంగా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగి, మధుమేహం తలెత్తుతుంది. హైపోథైరాయిడిజమ్ వంటి ఇతరత్రా హార్మోన్ల సమస్యలకూ దారితీయొచ్చు. గాలి కాలుష్యంతో సంతానం కలగటంలోనూ ఇబ్బంది కలగొచ్చు. అల్జీమర్స్ కూడా తలెత్తొచ్చు.
- పర్యావరణంలోని డీడీటీ, బిస్ఫెనాల్ ఎ, ఎంఎస్‌జీ, ఆర్సెనిక్ వంటివి ఊబకాయం పెరిగేలా చేసే ప్రమాదముంది.
- భూమిలో కలిసే కాలుష్య కారకాలు ఏడీహెచ్‌డీ, ఆటిజమ్ వంటి నాడీ సమస్యలకు.. ఎముకల జబ్బులకు దారితీయొచ్చు.
- ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవి తేలికగా నీటిలోకి, మట్టిలోకి చేరుకుంటాయి. ఇలా నీరు, ఆహార పదార్థాల ద్వారా ఒంట్లోకి ప్రవేశించి.. హార్మోన్లతో ముడిపడిన క్యాన్సర్లకు దారితీయొచ్చు. సంతానలేమి, ఆటిజమ్ వంటి నాడీ సమస్యలకూ కారణం కావొచ్చు.
- శబ్దకాలుష్యంతో వినికిడి లోపమే కాదు, గుండెజబ్బులూ రావొచ్చు. నిరంతరం పెద్ద శబ్దాలకు గురవటంతో తలెత్తే చికాకు రక్తపోటు పెరిగేలా చేస్తుంది. ఇది క్రమంగా గుండెజబ్బులకూ దారితీయొచ్చు. మూడ్ మారిపోవటం, తలనొప్పి వంటివీ తలెత్తొచ్చు.
ఇప్పుడు ఇ-వ్యర్థాలు కూడా పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాడిపారేసే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల వంటి వాటిల్లో పాదరసం, కాడ్మియం, బేరియం, సీసం, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్, పాలిక్రోమినేటెడ్ బైఫినైల్ వంటి వెయ్యికి పైగా హానికారక రసాయనాలుంటాయి. అసంఘటిత రంగంలో తగు జాగ్రత్తలు తీసుకోకుండానే ఇ-వ్యర్థాలను శుద్ధి చేస్తుంటారు. దీంతో హానికారక రసాయనాల ప్రభావానికి గురయ్యే ముప్పు పెరుగుతుంది. వీటి ప్రభావంతో కాలేయం, గుండె, కిడ్నీ, మెదడు, ఎముకల జబ్బులు తలెత్తొచ్చు. గర్భిణులు వీటి ప్రభావానికి గురైతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టటం, పుట్టుకతోనే శిశువు మరణించటం, శిశువుల్లో డీఎన్‌ఏ దెబ్బతినటం వంటి సమస్యలూ తలెత్తొచ్చు.
Pollution Free Environment: కాలుష్యం/పర్యావరణ జబ్బులను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది. ఎవరి కోసమో వేచి చూడొద్దు. ఎవరికివారే శ్రద్ధ తీసుకోవాలి. మనం కాలుష్యానికి కారణమైతే అది మన మీదే కాదు, చుట్టుపక్కల వారి మీదా ప్రభావం చూపుతుందని తెలుసుకోవాలి. ప్రజలు, ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు, యాజమాన్యాలు, కార్మికులు అంతా సమష్టిగా ప్రయత్నించాలి. పొగలను బ్యాక్‌ఫిల్టర్ నుంచి పంపించటం ద్వారా చిమ్నీల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించొచ్చు. ద్రవరూపంలో బయటకు వచ్చే వ్యర్థాలను వీలైనంతవరకు పునర్వినియోగించుకోవాలి. పునర్వియోగం సాధ్యం కాకపోతే శుద్ధి చేసి, దానిలోని హానికారక పదార్థాలను తొలగించి, బయటకు పంపాలి. ఘన వ్యర్థాలను గుర్తించిన ప్రాంతాల్లోనే.. ప్రజలకు, ఆవాసాలకు దూరంగా నిర్ణీత ప్రాంతంలో వేయాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అవసరమైతే మాస్కుల వంటి రక్షణ పరికరాలు వాడుకోవాలి.
- సురక్షిత నీటినే తాగాలి. అనవసరంగా పంటలకు పురుగుమందుల వంటివి వాడొద్దు.
- వాహనాల నుంచి వెలువడే కాలుష్యం మితిమీరకుండా చూసుకోవాలి.
- ఇళ్ల వంటివి నిర్మించేటప్పుడు, బోరింగ్ బావులు వేసేటప్పుటు దుమ్ము ధూళి పరిసరాల్లో వెలువడకుండా చూసుకోవాలి.
- అధీకృత డంప్‌యార్డుల వద్దకు ప్రజలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వివిధ రూపాల్లో.. మార్గాల్లో.. ప్రతీ రసాయనానికి ఒక పరిమిత స్థాయి ఉంటుంది. అంతవరకు ఇబ్బందులేమీ సృష్టించకపోవచ్చు. పరిమితి దాటితే మాత్రం హానికరంగా పరిణమిస్తుంది. కాలుష్య కారకాలు చేస్తున్న చేటు ఇదే. చిమ్నీలు, వాహనాల నుంచి వెలువడే పొగలతో గాలి కలుషితం కావచ్చు. పరిశ్రమల్లోంచి బయటకు వచ్చే నీరు, ద్రవాలు, రసాయనాలు కాలువల్లోకి, నదుల్లోకి చేరుకోవచ్చు. డంపింగ్ యార్డుల్లో వేసే ఘన వ్యర్థాల్లోని కాలుష్య కారకాలు నేలలోకి ఇంకిపోవచ్చు. గాలి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడే పొగ. భవన నిర్మాణాలు, రాళ్ల క్వారీలు, సరిగా నియంత్రించని విద్యుత్ కేంద్రాలు, కట్టెలు, బొగ్గుల పొయ్యిలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ వంటివీ దీనికి కారణమే. ఇక భూమి కలుషితం కావటానికి దోహదం చేస్తున్నవి నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలు. ముఖ్యంగా పురుగు మందులు, హానికర రసాయనాల వంటి వాటిల్లోని కాలుష్య కారకాలు మట్టిలో, భూగర్భజలంలో చాలాకాలం అలాగే ఉంటాయి. సీసం, రేడియో ధార్మిక పదార్థాల వంటివి నీటి ద్వారా భూమిలోకి ఇంకిపోవచ్చు. ఆర్గనో ఫాస్ఫరస్, ఆర్గనో క్లోరైడ్ భూగర్భజలంలోకి ఇంకి తినే పదార్థాల్లోకీ చేరొచ్చు. ఇలాంటి కాలుష్య కారకాలు ముక్కుతో పీల్చుకోవటం, నోటితో మింగటం, తాకటం.. ఈ మూడు మార్గాల ద్వారా ఒంట్లోకి ప్రవేశిస్తుంటాయి. గాలిలోని కాలుష్య కారకాలు శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి చేరతాయి. హానికారక రసాయనాలను చేత్తో తాకి, శుభ్రంగా కడుక్కోకుండా అదే చేత్తో భోజనం చేయటం.. లేదూ కలుషిత నీటిని తాగటం, కలుషిత నీటితో పండించిన ఆహార పదార్థాలను తినటం ద్వారా లోపలికి చేరుకోవచ్చు. కొన్ని రసాయనాలు నేరుగా చర్మం ద్వారానూ ఒంట్లోకి వెళ్లొచ్చు.
ఇదీ చదవండి: బీపీ, షుగర్, ఊబకాయం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే దూరం!