వేపాకులు, వేపనూనె ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చని మన బామ్మలు, అమ్మమ్మలు అప్పుడప్పుడు చెబుతుంటారు. కానీ, అవన్నీ ఛాదస్తపు మాటలనుకుని పెద్దగా పట్టించుకోము. కానీ, వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు చుండ్రు కారణంగా వచ్చే దురద, మంటను సైతం ఇవి తగ్గిస్తాయి. మరి ఈ ఫలితాన్ని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా...
నీటిని ఉపయోగించి..
- గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని వేపాకులు వేసి పూర్తిగా రంగు మారేంత వరకు మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని బాగా చల్లారనిచ్చి వేపాకులను వేరుచేయాలి. షాంపూ చేసుకున్న అనంతరం ఈ నీటితో మాడును శుభ్రపరచుకుంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
- ఐదు కప్పుల వేడి నీటిలో గుప్పెడు వేపాకులు వేసి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం వేపాకులను తీసేసి ఈ నీటితో మాడును శుద్ధి చేసుకుంటే చుండ్రు వదలిపోవడంతో పాటు.. తలలో దురద, ఇతర ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.
హెయిర్‌ప్యాక్‌తో..
- రాత్రంతా నానబెట్టిన మెంతులకు కొన్ని వేపాకులు జోడించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి కొద్దిగా పెరుగుని సైతం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది
- గుప్పెడు వేపాకులను తీసుకొని పదినిమిషాల పాటు నీటిలో ఉంచాలి. ఆ తర్వాత వాటిని మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. దీనికి కాస్త కలబంద గుజ్జుని సైతం కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని తలకు అప్త్లె చేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమంలో కలబంద గుజ్జుకి బదులుగా ముల్తానీ మట్టిని కూడా ఉపయోగించవచ్చు. అయితే మిశ్రమం పూర్తిగా మృదువుగా అయ్యేంత వరకు నానబెట్టి ఉంచడం మంచిది.
- వేపాకులను బాగా ఎండబెట్టి పొడిచేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి సుమారు గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో మార్కెట్లో సైతం వేపపొడి లభిస్తోంది.
నూనె మిశ్రమంగా..
- వేపనూనె సైతం చుండ్రు సమస్యను నివారించడంలో ఉపయోగపడుతుంది. దీనికోసం కొద్దిగా వేపనూనె తీసుకొని గోరువెచ్చగా వేడిచేసుకోవాలి. దీన్ని తలకు మర్దన చేసుకొని ఇరవైనిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
- కప్పు కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులను వేసి పదిహేను నిమిషాల పాటు సన్నని సెగపై వేడిచేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని వడపోయాలి. దీనిలో టేబుల్‌స్పూన్ నిమ్మరసం, పావు కప్పు ఆముదం కూడా కలపాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు తలకు రాసుకొని మర్దన చేసుకోవడం ద్వారా చుండ్రు సమస్యను త్వరలోనే వదిలించుకోవచ్చు. అలాగే జుట్టు సైతం దృఢంగా తయారవుతుంది
- గిన్నెలో కప్పు కొబ్బరి నూనె వేసి గోరువెచ్చగా వేడిచేయాలి. దీనిలో పావు కప్పు వేపనూనె కలపాలి. దీన్ని రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఇదీ చదవండి: మీకు చుండ్రు ఉందా... అయితే దానికి ఇలా చెక్ పెట్టండి..!