కాలేయానికి కొవ్వు పట్టటం (ఫ్యాటీ లివర్ డిసీజ్), మధుమేహం.. రెండూ వేర్వేరు సమస్యలే కావొచ్చు. కానీ రెండింటికీ బలమైన సంబంధమే ఉంది. కాలేయ చికిత్సతో రక్తంలో గ్లూకోజు అదుపులోకి వస్తున్నట్టు తేలింది. ఊబకాయుల్లో ఇది ఇంకాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుండటం విశేషం. ఇన్సులిన్ హార్మోన్ మన కణాల్లోకి గ్లూకోజు ప్రవేశించేలా చేస్తుంది. టైప్2 మధుమేహుల్లో ఈ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఇన్స్‌లిన్‌కు కణాలు అంతగా స్పందించవు. దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటారు. కణాలు గ్లూకోజును స్వీకరించలేకపోవటం వల్ల రక్తంలో దీని స్థాయులు పెరుగుతాయి. మరోవైపు మధుమేహుల్లో ఇన్సులిన్ ఉత్పత్తీ ఎక్కువవుతుంది. దీంతో ఆకలి, రక్తపోటు, బరువు పెరుగుతాయి. ఇలా ఇన్సులిన్ నిరోధకత రెండిందాలా హాని చేస్తుంది. ఫ్యాటీ లివర్, అధిక బరువు సమస్యలకూ మధుమేహానికీ బలమైన సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే బయటపడింది.
ఈ నేపథ్యంలో అమెరికా పరిశోధకులు వినూత్నంగా ఆలోచించారు. కాలేయంలో గాబా అనే నాడీ సమాచార వాహకం అధికంగా ఉత్పత్తి కావటాన్ని తగ్గిస్తే ఇన్సులిన్‌కు కణాలు స్పందించే గుణం మెరుగవుతున్నట్టు గుర్తించారు. ఈ చికిత్సను దీర్ఘకాలం తీసుకుంటే ఆకలి, బరువు తగ్గే అవకాశముందనీ కనుగొన్నారు. నాడీ సమాచార వాహకాలు నాడీకణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తుంటాయి. ఇలా మెదడుకు ఇతర శరీర భాగాలకు మధ్య అనుసంధానానికి తోడ్పడతాయి. గాబా అనేది నాడీ వ్యవస్థలో సంకేతాలను తగ్గించే సమాచార వాహకం (ఇన్‌హిబిటరీ న్యూరోట్రాన్స్‌మిటర్).
ఇది కాలేయంలో ఉత్పత్తి అయ్యినప్పుడు కాలేయం నుంచి మెదడుకు సంకేతాలను పంపించే నాడుల పనితీరు తగ్గుతుంది. మెదడులో ఉత్తేజిత ప్రక్రియ మందగిస్తుంది. దీంతో కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వెళ్లే సంకేతాలు అస్తవ్యస్తమవుతాయి. ఇది గ్లూకోజు హోమియోస్టేసిస్‌ను (రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజు సమతుల్యతను) దెబ్బతీస్తుంది. ఊబకాయ ప్రేరేపిత ఫ్యాటీ లివర్ మూలంగా కాలేయంలో గాబా ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే కాలేయంలో గాబా ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే గాబా ట్రాన్సమినేజ్ (గాబా-టి) అనే ఎంజైమ్‌పై దృష్టి సారించారు. దీని పనితీరును అడ్డుకుంటే గాబా ఉత్పత్తి తగ్గుతోందని, ఫలితంగా ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుముఖం పడుతోందని కనుగొన్నారు. ఇది మధుమేహానికి చికిత్సగానూ ఉపయోగపడుతుండటం విశేషం.
ఇదీ చదవండి : ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిన్న మార్పు చాలు!