మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. కళ తప్పి పొడిబారినట్లు అవుతుంది. మరి చర్మం సజీవంగా నిగనిగలాడాలంటే ఏం చేయాలో చూసేద్దాం రండి..
- అరకప్పు ఓట్స్ పొడిలో సరిపడా తేనె వేసి కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి, బాగా మర్దన చేయాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేస్తే చాలు. ఇలా వారానికోసారి చేస్తే మృతకణాలు పోవడమే కాదు.. చర్మం కూడా మృదువుగా మారుతుంది.
- వంటసోడా, చక్కెరా, తేనె, యాపిల్ సిడార్ వెనిగర్, ఆలివ్ ఆయిల్, ప్యూమిస్ రాయి, ఓట్ మీల్... ఇవన్నీ మీ ముఖాన్నీ, చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇంట్లో తయారుగా ఉండే పదార్థాలు. వీటన్నింటిని ఉపయోగించి మృతకణాలు తొలగించుకోవచ్చు
- చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌నూనె బాగా కలిపి ఇందులో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి, మిగతా శరీరానికి రాసి కొన్ని నిమిషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. పదినిమిషాలాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. అదే సమయంలో నూనె చర్మానికి కావాల్సిన తేమనూ, పోషణనూ అందిస్తుంది
- ఈ కాలంలో ముల్తానీమట్టి పూత ముఖానికి పూతలా వేయడం వల్ల చర్మం తాజాగా మారడమే కాదు, ముఖంపై పేరుకొన్న మృతకణాలు కూడా పోతాయి.రెండు చెంచాల ముల్తానీమట్టిలో సరిపడా గులాబీనీరు కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక చల్లనినీటితో కడిగేయాలి.
- ఎర్రకందిపప్పు పొడిని రెండు చెంచాలు తీసుకుని అందులో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, సరిపడా పాలు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ పూతను ముఖం మెడకు పట్టించి.. ఆరనివ్వాలి. పది నిమిషాల తరువాత చేత్తో రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే... మృతకణాలు సులువుగా పోతాయి. చర్మం కూడా తాజాగా మారుతుంది.
ఇదీ చదవండి: 'మునగ'తో అందంలో మునిగి తేలుదాం!