కరోనా దెబ్బకు బడులు, ఆఫీసులన్నీ మూతపడ్డాయి. సినిమాలు, హోటళ్లు బందయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. విజ్ఞానం, వినోదం, ఆదాయం అందించే సమస్త వ్యవస్థలన్నీ అతలాకుతలమైపోయాయి. మొత్తంగా మన జీవనశైలే అస్తవ్యస్తమైపోయింది. దేశవ్యాప్త దిగ్బంధంతో రోజంతా ఇంట్లోనే ఉండిపోవటం, బయటకు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో, కొంత సమయానికే పరిమితం కావటం. ఏమాత్రం అనుమానం వచ్చినా స్వీయ నిర్బంధం. తప్పనిసరైతే ప్రత్యేక పర్యవేక్షణ(క్వారంటైన్). జబ్బు నిర్ధరణ అయితే విడిగా చికిత్స (ఐసోలేషన్). మందూ మాకూ, టీకాలు లేని జబ్బును ఎదుర్కోవటానికి ఇంతకు మించిన మార్గమేదీ కనబడని ఇలాంటి విపత్కర పరిస్థితి ఇంకెంత కాలముంటుందోననే అనిశ్చితి ఒకవైపు.. ఎప్పుడెవరిని జబ్బు కాటేస్తుందోననే భయం మరోవైపు ఎవర్నీ కుదురుగా ఉండనీయటం లేదు.
ఏ పనిచేస్తున్నా మనసంతా దాని మీదే. మున్ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళనే. వ్యాపారాలు కుదేలు కావటం, ఉద్యోగాలు ఉంటాయో, ఉండవోననే ఊగిసలాటకు తోడు ఆదాయాలు, పొదుపు మొత్తాలు తగ్గిపోవటం వంటివన్నీ మానసికంగా విపరీత ప్రభావం చూపేవే. ఇవి తీవ్ర భయాందోళనలకు దారితీస్తాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అప్పటికే మానసిక సమస్యలతో బాధపడేవారికైతే మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవటానికి, మానసిక నిబ్బరం కోల్పోకుండా ఉండటానికి వ్యక్తులుగా, సమాజంగా మనమంతా తగు జాగ్రత్తతో వ్యవహరించటం ఎంతైనా అవసరం.
అటు భయం - ఇటు అనిశ్చితి
కరోనా ఆందోళనకు కారణమవుతున్న అంశాలను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది.
ఒకటి- భయం.. దీంతో కొంత లాభముంది, కొంత నష్టముంది. నాకూ వస్తుందేమోనన్న భయం ఉన్నప్పుడు ప్రభుత్వం, నిపుణులు చెప్పిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించటానికి తోడ్పడుతుంది. ఇలా మేలే చేస్తుంది. అదే భయం మితిమీరితే ఆందోళనకు (ఆంగ్జయిటీ) దారితీస్తుంది. నాకేమైనా అయిపోతుందేమో, ఏదైనా అయితే ఏం చెయ్యాలి? ఎవరిని సంప్రదించాలి? బయటకు వెళ్లటానికేమో వీల్లేదాయె? ఇంట్లో ఉండిపోతే ఇంకేమైనా అవుతుందేమో? వంటి ఆలోచనలు ఆందోళన మరింత పెరిగేలా చేస్తాయి. ఇది అక్కడితోనే ఆగిపోకపోవచ్చు. తర్వాతి దశలోకి.. అంటే ఉన్నట్టుండి తీవ్ర భయాందోళనలు చెలరేగే (పానిక్) స్థితిలోకీ నెట్టేయొచ్చు. ఇది అప్పుడప్పుడు దఫదఫాలుగా దాడి చేస్తుండొచ్చు.
రెండోది- అనిశ్చితి.. ఎప్పుడేం జరుగుతుందో? ఎక్కడికి దారితీస్తుందో? అనే అనిశ్చిత స్థితి మానసికంగా బాగా కుంగదీస్తుంది. ప్రస్తుతం కరోనాకు టీకా లేదు. కచ్చితమైన, ప్రామాణికమైన చికిత్సా లేదు. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇదే చాలామందిలో భయాందోళనలు రేపుతోంది. మరోవైపు- కుటుంబంలో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్ వస్తే అది తమ తప్పే అయినట్టు ఇరుగుపొరుగు వెలి వేసినట్టు చూడటం, ఎదురుపడ్డప్పుడు పక్కకు జరగటం, మాట్లాడకపోవటం వంటివీ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక ఆత్మీయులు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. కరోనాతో ముడిపడిన ఇలాంటి అంశాలన్నీ రకరకాల మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి.
- కుంగుబాటు: ఆందోళన ఎక్కువైతే కుంగుబాటు(డిప్రెషన్) బారినపడే అవకాశముంది. అప్పటికే కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అవి మరింత తీవ్రమవ్వచ్చు.
- నిద్రలేమి: నిద్ర పట్టకపోవటం, పట్టినా వెంటనే మెలకువ రావటం పెద్ద సమస్య. ఇదిలాగే కొనసాగితే మున్ముందు ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది.
- దురలవాట్లు: మానసికంగా బలహీనంగా ఉన్నవారు మద్యపానం, సిగరెట్లు కాల్చటం, మత్తుమందులు తీసుకోవటం వంటి దురలవాట్లకు లోనయ్యే అవకాశముంది. అప్పటికే ఇలాంటి అలవాట్లు గలవారిలో మరింత పెరిగిపోవచ్చు. ఇవి మానసిక సమస్యలను ఇంకాస్త ఎక్కువ చేస్తాయి.
- వేదనానంతర సమస్య: కరోనా తగ్గిన తర్వాతా దీని ప్రభావం కొనసాగొచ్చు (పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్). దీంతో కోపం, చిరాకు, నలుగురితో కలవలేకపోవటం, గతాన్ని తలచుకొని కుమిలిపోవటం, తీవ్ర ఆందోళన, ఎవరినీ నమ్మకపోవటం, నిద్ర పట్టకపోవటం వంటివి ఇబ్బంది పెట్టొచ్చు.
- నిందించుకోవటం: జబ్బు బారినపడితే ఏదో తప్పు చేశామనే భావనతోనూ కొందరు కుమిలిపోతుండొచ్చు. కొవిడ్-19తో మరణిస్తే ప్రస్తుతం ఆయా ఆచారాల పరంగా దహన సంస్కారాలు చేసే వీలు లేదు. దీంతోనూ కుటుంబసభ్యుల్లో ఏదో వెలితి, తమను తాము నిందించుకోవటం వంటి ధోరణులు తలెత్తొచ్చు. ఆత్మీయులను కోల్పోయిన బాధకు ఇవీ తోడైతే నిబ్బరం కోల్పోయి కుంగుబాటులోకీ వెళ్లే ప్రమాదముంది.
నివారణ మార్గముంది
మన చుట్టూ ఉన్నవారంతా భయాందోళనలకు గురవుతున్నప్పుడు మానసిక స్థైర్యం ఒకింత సడలటం సహజమే. అలాగని అధైర్య పడటం తగదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే మనో నిబ్బరం కోల్పోకుండా చూసుకోవచ్చు. మనం కర్ర పట్టుకొని భయాలను పూర్తిగా తరమలేకపోవచ్చు గానీ మనసును కుదురుగా, ప్రశాంతగా ఉంచే మార్గాలను నేర్చుకోవచ్చు. చిన్న పనితో ఆరంభించినా పెద్ద ఫలితమే కనిపిస్తుంది.
ఎప్పటి మాదిరిగానే: ఇంటికే పరిమితమైనప్పుడు దినచర్య అస్తవ్యస్తమవుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. వీటికి తావివ్వకుండా చూసుకోవాలి. ఇంటి నుంచి ఆఫీసు పని చేసేవారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ మిగతావారు రోజువారీ పనుల్లో తేడా లేకుండా చూసుకోవాలి. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని బద్ధకం తగదు. ఆఫీసుకు వెళ్లే రోజుల్లో మాదిరిగా ఉండటానికే ప్రయత్నించాలి. ఉదాహరణకు ఆఫీసులో ఉండే సమయంలో ఏవైనా పనులు కల్పించుకొని చేయాలి. అంతకుముందు మిగిలిపోయిన పనులను పూర్తి చేయొచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడుకోవచ్చు. చాలాకాలంగా మాట్లాడటానికి వీలుపడని వారికి ఫోన్ చేయొచ్చు. ఈ మెయిళ్లు చేయొచ్చు. కళలు, సంగీతం వంటి అభిరుచులను అలవరచుకోవచ్చు. ఒకవేళ ఆపేస్తే తిరిగి ప్రారంభించొచ్చు. మొత్తంగా ఏదో ఒక పనిలో నిమగ్నమవటం ముఖ్యమని తెలుసుకోవాలి.
- అదేపనిగా వద్దు: సమాచారాన్ని తెలుసుకోవటం మంచిదే గానీ రోజంతా కరోనాకు సంబంధించిన అంశాల్లోనే మునిగిపోవటం తగదు. ప్రభుత్వం కూడా కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందుబాటులో ఉండేలా చూడాలి. లేకపోతే తీవ్ర భయాందోళలను తలెత్తుతాయి. వదంతులు పెరిగిపోతాయి. ఇవి మరింత చేటు చేస్తాయి.
- కంటినిండా నిద్ర: రోజు మాదిరిగానే వేళకు పడుకోవటం, లేవటం చాలా మంచిది. దీంతో నిద్రలేమి వంటి సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే ఆందోళన తగ్గుతుంది.
- వేళకు భోజనం: ఇంట్లో ఉంటున్నాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినటం మంచిది కాదు. వేళకు భోజనం చేయాలి. సమతులాహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్ మానెయ్యాలి.
- ప్రాణాయామం: గాఢంగా శ్వాస తీసుకోవటం (ప్రాణాయామం), ధ్యానం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. అలాగే ఇంట్లోనే తేలికైన వ్యాయామాలు చేస్తుండాలి. ఇవి ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయి. ఆందోళనకు, కుంగుబాటుకు లోనుకాకుండా చూస్తాయి.
- కుమిలిపోవద్దు: ఆసుపత్రుల్లోనో, వేరే ఎక్కడైనా విడిగా (క్వారంటైన్) ఉంటున్నవాళ్లు అదేపనిగా కుమిలిపోవటం తగదు. ఇది మన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవటానికి తీసుకుంటున్న ముందు జాగ్రత్తే తప్ప మరోటి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీలైనప్పుడల్లా కుటుంబసభ్యులకు, బంధువులకు, మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు వీడియోలో చూస్తూ మాట్లాడుకునే సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో, ప్రత్యేక గదుల్లో ఉన్నప్పుడూ ప్రాణాయామం, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి. వీటితో మనసు తేలికపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. కుంగుబాటుకు లోనవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే క్వారంటైన్‌లో ఉన్నవారికి అక్కడి డాక్టర్లు, నర్సుల వంటి వైద్య సిబ్బంది క్వారంటైన్ అంటే ఏంటి? ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది? బయటకు వెళ్లాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నింటినీ పూర్తిగా విడమరచి చెప్పాలి. లేకపోతే ఏమవుతుందో ఏమో, ఇలా ఇంకెన్నాళ్లో అనే దిగులు మొదలవుతుంది. ఇలాంటి అనిశ్చితి మనిషిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది.
- వైద్యులూ జాగ్రత్త: డాక్టర్లు, నర్సుల వంటి వైద్య సిబ్బంది సైతం ఆందోళనకు గురికావొచ్చు. చికిత్స చేస్తున్నప్పుడు పొరపాటున తమకు ఇన్‌ఫెక్షన్ వస్తే? తమ మూలంగా ఇంట్లో వాళ్లకు వస్తే? ఇలాంటి ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. మరోవైపు తాము చికిత్స చేస్తున్నవారిలో ఎవరైనా హఠాత్తుగా మరణించొచ్చు. కొన్నిసార్లు వార్డుల్లో మరణాల సంఖ్య పెరుగుతుండొచ్చు. ఇవన్నీ తీవ్ర భయాందోళనలకు దారితీసేవే. మనో నిబ్బరాన్ని దెబ్బతీసేవే. అందువల్ల ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యాలు వైద్య సిబ్బంది నిర్లిప్త ధోరణిలోకి జారిపోకుండా, కుంగుబాటుకు లోనవ్వకుండా చూసుకోవాలి. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చికిత్స, సేవలు చేసేవారికి అక్కడే వసతి కల్పించటం.. షిష్టు వేళలు సుదీర్ఘంగా లేకుండా చూడటం.. తగినంత విశ్రాంతి తీసుకునేలా, నిద్ర పోయేలా ఏర్పాట్లు చేయాలి.
మనకు మనమే బాసట
జీవితం అనుభవాలు, ఘటనల ప్రవాహం. ఒక్క దాంతో ఆగిపోయేది కాదు. కరోనా కూడా అలాంటిదే. ఇదీ ఒకరోజు పోయేదే. ఇలాంటి భరోసాను మనకు మనమే కల్పించుకోవటం ఎంతైనా అవసరం.
నిజాలు తెలుసుకోండి: ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టమైన, పారదర్శకమైన సమాచారం చాలా ముఖ్యం. లేకపోతే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎవరికి ఏది తోస్తే అది పంపించటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అరకొర విషయాలు, అవాస్తవాలతో బయాందోళనలు మరింత పెరుగుతాయి. కాబట్టి వదంతులను నమ్మకుండా, నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విశ్వసనీయమైన సంస్థలు అందించే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. నూటికి 90% మందిలో సమస్య మామూలుగానే తగ్గిపోతోందని, కొందరిలో పూర్తిగా నయమైపోతోందని, కొందరిలోనే ప్రాణాంతకంగా పరిణమిస్తోందనే సంగతిని గుర్తించగలిగితే ఆందోళన దానంతటదే తగ్గుతుంది.
ఇదొక్కటే కాదు: మన జీవితాలను కుదిపేసింది ప్రస్తుత సంక్షోభం ఒక్కటేనా? ఇంతకుముందు ఇలాంటి విపత్కర పరిణామాలను ఎన్ని ఎదుర్కోలేదు? ఆత్మీయుల మరణం కావొచ్చు. కోరుకున్న ఉద్యోగం దొరక్కపోవటం కావొచ్చు. ఉన్నట్టుండి ఉద్యోగం పోవటం కావొచ్చు. ఇలా ఏదో ఒక అనూహ్య పరిణామాన్ని చూసినవాళ్లమే. అవి ఎల్లకాలం అలాగే ఉండిపోయాయా? అప్పటికప్పుడు భావోద్వేగాలకు గురికావటం, అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణాలూ కాలగతిలో కలిసిపోవటం, మామూలు మనిషి కావటం, మన పనుల్లో మనం మునిగిపోవటం చూస్తున్నదే. కొవిడ్-19 రోజులూ అలాగే గడిచిపోతాయి. కాకపోతే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అనేవి తెలుసుకొని, మసలు కోవాలి. అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో అతిగా భయపడకపోవటం, నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉండకపోవటమూ అంతే అవసరం.
గుర్తించటమెలా?
ఆందోళన, ఉన్నట్టుండి భయభ్రాంతులకు గురవటం వంటి సమస్యలను కొన్ని లక్షణాలతో గుర్తించొచ్చు.
- మాటిమాటికీ కొవిడ్-19 సమాచారం తెలుసుకోవాలని అనుకోవటం.
- గతంలో జరిగిన సంఘటనలను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం.
- అతిగా తినటం వంటి విపరీత అలవాట్లు చేసుకోవటం.
- జరగకూడనిదేదో జరగొచ్చనే భయంతో సరిగా నిద్రపోకపోవటం.
- అన్ని విషయాలకూ తానే బాధ్యుడనని నిందించుకోవటం.
- దేని మీదా ఏకాగ్రత కుదరకపోవటం, కుంగిపోవటం.
ఇదీ చదవండి: కరోనా అంతానికి దివ్యాస్త్రమైన టీకా ఎప్పుడొస్తుందంటే?