కండలు తిరిగిన దేహం కోసం పురుషులు కలలు కంటారు. ఇక సిక్స్ ప్యాక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొట్ట పెరుగుతోంది అనిపిస్తే చాలు.. వ్యాయామాల డోసు పెంచేస్తారు. శరీరం మీద ఇంత దృష్టిపెట్టే పురుషుల్లో కొందరు తమ మర్మాంగాలను కనీసం సరిగ్గా శుభ్రం కూడా చేసుకోరు. కానీ పురుషాంగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. 'జెనిటల్ హైజీన్' లేకపోతే ఎన్నో వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
జెనిటల్ హైజీన్..
సాధారణంగా పురుషాంగాన్ని శుభ్రం చేసుకునే అలవాటు చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి. సున్తీ కాని వారు.. పురుషాంగ చర్మంలోని ముందు భాగాన్ని వెనక్కి లాగి, శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పాత కాలంలో తల్లిదండ్రులే చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరికీ సమయం ఉండటం లేదు. చివరకు మగపిల్లలకు మర్మాంగాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియడం లేదు.
యుక్తవయస్సులో ఉన్నవారు 'జెనిటల్ హైజీన్'పై పాఠాలు నేర్చుకోవడం అవసరం. పైన చెప్పిన విధంగా మర్మాంగాన్ని శుభ్రం చేసుకోవాలి. సాధారణ సబ్బు కూడా వాడుకోవచ్చు.
లైంగిక కలయిక తర్వాత..
లైంగిక కలయిక తర్వాత మర్మాంగాన్ని శుభ్రం చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. శృంగారం తర్వాత పురుషాంగ చర్మాన్ని శుభ్రం చేయకపోతే క్యాండిడైడిస్తో పాటు ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
లోదుస్తులు..
చాలా మంది పురుషులు స్నానం చేసిన తర్వాత గజ్జల భాగాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోరు. తడి మీదే లోదుస్తులు వేసుకుంటారు. ఇదీ తప్పే! లోదుస్తులను కూడా ఎప్పటికప్పుడు ఉతికి, పొడిగా పెట్టుకోవాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లోదుస్తులను మార్చాలి.
ఇవి పాటించని వారిలో 'గ్రోయిన్ ఇన్ఫెక్షన్లు' ఎక్కువవుతాయి. గజ్జల భాగం నల్లగా మారుతుంది, దురదలు వస్తాయి. వీటికి కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్.
ఈ మధ్యకాలంలో చాలా మంది పురుషులకు టైట్‌గా ఉండే జీన్స్ వేసుకోవడం అలవాటుగా మారింది. దీని వల్ల శరీరం కింది భాగానికి గాలి ఆడటం లేదు. అటు ప్యాంటును కూడా ఎక్కువ రోజులు ఉతకకుండా వాడేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా ఇన్ఫెక్షన్లు అంటుకుంటాయి.
ఫ్యాక్టరీలు, తేమ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయాలి. నిద్రిస్తున్న సమయంలో టైట్‌గా ఉండే అండర్వేర్లు వేసుకోకూడదు. బాక్సర్లు వాడితే మంచిది.
ఇన్ఫెక్షన్ వస్తే ఇలా తెలుస్తుంది..
- గజ్జలు, పురుషాంగం చివర్లో దురద
- పురుషాంగం చివర ఉండే చర్మం ఎర్రగా మారిపోవడం
- పురుషాంగం చివర ఉండే చర్మం కోసుకుపోవడం
చికిత్స అవసరం..
పైన చెప్పిన లక్షణాలు కనపడినా చాలా మంది వాటిని బయటకు చెప్పేందుకు సిగ్గుపడుతూ ఉంటారు. భరించలేనంత నొప్పి వస్తే కానీ బయటపడరు. అవసరమైతే వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంటుందన్న విషయం అర్థం చేసుకోవాలి.
- మధుమేహం ఉన్న వారికి గాయం నయం కావడానికి ఆలస్యమవుతుంది. ఇది పురుషాంగంలో ఇన్ఫెక్షన్కు కూడా వర్తిస్తుంది. ఆ సమయంలో వైద్యుల సూచన మేరకు వారు సున్తీ చేయించుకోవాల్సి ఉంటుంది.
- లైంగిక సంక్రమణ వ్యాధులు సోకితే.. భాగస్వామి కూడా చికిత్స పొందాలి.
- పౌడర్లు వాడితో సరిపోతుంది అనుకోవడం తప్పు. చర్మంలో రంధ్రాలు పూరుకుపోయి సమస్య మరింత పెరుగుతుంది.
- మంచానికే పరిమితమై, డైపర్లు వాడుతున్న పురుషులకు వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇదీ చూడండి:- సెక్స్‌పై ఆసక్తి తగ్గిందా? ఇలా చేస్తే సరి...