కరోనా సెకండ్ వేవ్‌లో కొందరు పిల్లలకూ వైరస్ సోకింది. అయితే వారిలో లక్షణాలు తక్కువ స్థాయిలోనే కనిపించాయి. ఆ లక్షణాలను గమనించినా సరైన సమయంలో చికిత్స తీసుకోని వారిలో ప్రాణాంతకంగా మారింది. అందువల్ల ముందుగానే ఈ లక్షణాలను గురించడం కీలకం. అవి...
- జలుబు, దగ్గు, జ్వరం
- ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది.
- ముక్కు దిబ్బడ, ముక్కు కారటం
- కండరాల నొప్పులు
- తలనొప్పి
- 8 ఏళ్లు దాటిన పిల్లల్లో రుచి, వాసన కోల్పోవటం.
- వాంతులు
- విరేచనాలు
- అలసట
శరీరమంతా ఇన్ఫెక్షన్ వల్ల శోథ కలిగి అనేక అవయవాలు దెబ్బతినవచ్చు. ఈ అవయవాల క్రియా మందగమనానికి కరోనా వైరస్ కు ఉన్న సంబంధాన్ని వైద్యులు ఇంకా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
శరీరంలోని అనేక వ్యవస్థలు ఈ వైరస్ వల్ల దెబ్బతింటే కలిగే లక్షణాలు ఇవి.
- జ్వరం
- కడుపునొప్పి
- వాంతులు, విరేచనాలు
- మెడ నొప్పి
- కళ్లు ఎర్రబడటం
- అలసట
- పెదవులు పగిలి ఎర్రబడటం
- దద్దుర్లు
- చేతులు, కాళ్లలో వాపు
- లింఫ్ గ్రంధుల వాపు (మెడ, చంక, గజ్జల్లో)
అనేక వ్యవస్థలు విఫలమైనపుడు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీపై ఒత్తిడి, నిద్ర మేల్కోవటంలో ఇబ్బంది కలుగవచ్చు. అలాంటపుడు సత్వర వైద్య సేవలు అందించాలి. కొద్దిపాటి లక్షణాలుంటే ఇంటి వద్దే చికిత్స తీసుకోవచ్చు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు పిల్లలను సాధ్యమైనంత వరకు ఏకాంతంగానే ఉంచాలి. కుటుంబంలో ఒకరు మాత్రమే వారికి సేవలందించాలి. కరోనా సోకిన శిశువు 2 ఏళ్లు వయసు పైబడి ఉంటే మాస్క్ కూడా ధరింపచేయాలి. మాస్క్ అలాగే ఉంచి ఎక్కువ సేపు పెద్దలు దూరంగా వెళ్లరాదు. వాళ్లు వాడే బాత్రూమ్ పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లోని వారందరూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏమైనప్పటికీ భయపడరాదు. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకాలు దొరుకుతున్నాయి. పిల్లలకు టీకాలు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి.