Home Remedies for Cough and Cold: చలికాలంలో జలుబు, దగ్గు వచ్చాయంటే.. ఓ పట్టాన తగ్గవు. పైగా ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు. దగ్గి..దగ్గి.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అలాంటి సమయంలో వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలతో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
తులసి – తమలపాకు: తమలపాకులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దగ్గును రాకుండా చేయడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి. అవసరమైతే తులసిని నీళ్లలో వేసి మరగించి కషాయంలా కూడా తీసుకోవచ్చు. "Phytotherapy Research" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తులసి ఆకులను తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించినట్లు స్పష్టమైంది.
తేనె: వంటింటి ఔషధాల్లో తేనే ఒకటి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. అలాగే నియాసిన్, రైబోఫ్లోవిన్ వంటి మూలకాలను కలిగి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
వేపాకులని లైట్ తీసుకుంటున్నారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే!
బెల్లం: బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. పొడి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అల్లం: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని పెంచడంతో పాటు లంగ్స్‌లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి దగ్గు నివారణకు అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కొద్దిగా అల్లం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి రోజూ తినడం వల్ల కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. "Journal of Ethnopharmacology" అధ్యయనం ప్రకారం.. అల్లం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించినట్లు స్పష్టమైంది.
పసుపు: దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీవైరల్ లక్షణాలు కఫాన్ని తగ్గిస్తాయి.
జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడం తగ్గుతాయి.
వాము: రాత్రిపూట పొడిదగ్గు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు చిటికెడు వామును చేతిలో నలిపి.. దవడకు పెట్టుకుని కాసేపు చప్పరించాలి. దీనివల్ల దగ్గు అదుపులోకి వస్తుంది. లేదంటే వామును వేయించి.. ఓ చిన్న క్లాత్‌లో వేసి వాసన పీల్చినా ఉపశమనం ఉంటుంది.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ను ఎదుర్కొనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇవి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనే కలిపి.. రోజుకు రెండు మూడుసార్లు చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం-పుదీనా టీ: అల్లం, పుదీనా ఆకులతో టీ తయారు చేసి తాగడం వల్ల కూడా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు.
మీ పిల్లలు అస్సలు ఫోన్ వదలట్లేదా? డోంట్ వర్రీ - ఈ టిప్స్ మీకోసమే!