Hair Growth Tips: నల్లటి ఒత్తయిన కురులను కాపాడుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా అందరూ తమకు తోచిన చిట్కాలను పాటిస్తారు. వీటిలో ఎక్కువ భాగం తలకు వేసే హెయిర్‌ప్యాక్‌లు, మాస్క్‌లే ఉంటాయి. అయితే కూరగాయలు సైతం జుట్టు రాలిపోవడాన్ని నియంత్రించి వాటిని దృఢంగా అయ్యేలా చేస్తాయి. అదెలా అనుకుంటున్నారా? సింపుల్.. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చక్కటి ఆరోగ్యంతో పాటు అందమైన శిరోజాలు సైతం మన సొంతమవుతాయి. అయితే కురుల ఎదుగుదలకు దోహదం చేసే ఆ కూరగాయలేంటో తెలుసుకుందామా..
చాలామందిలో ఐరన్ లోపం కారణంగానే జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటి వారిలో కురులను దృఢంగా ఉంచడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది.. దీన్నుంచి పీచుపదార్థం, ఐరన్, జింక్, ఇతర ఆవశ్యక విటమిన్లు లభిస్తాయి. ఇవన్నీ జుట్టు దృఢంగా ఉండటానికి, పొడవుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
క్యారట్ కూడా వెంట్రుకలను దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ బీ7 పుష్కలంగా లభిస్తుంది. దీన్నే బయోటిన్ అని పిలుస్తారు. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యారట్‌ని ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌ని కూడా అప్పుడప్పుడూ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందచ్చు. దీనికోసం కొన్ని క్యారట్ ముక్కలను తీసుకొని నీటిలో వేసి ఉడకబెట్టి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్త్లె చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ వెంట్రుకలు రాలడాన్ని నియంత్రించి వాటిని దృఢంగా పెరిగేలా చేస్తుంది.
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి రోజూ దీన్ని వంటల రూపంలో ఆహారంగా తీసుకొంటూ ఉంటాం. దీనిలో జింక్, ఐరన్, బయోటిన్‌తో సహా కురుల ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టుని బలంగా అయ్యేలా చేయడంతో పాటు చిన్న వయసులో వెంట్రుకలు తెల్లగా మారడాన్ని నిరోధిస్తాయి.
చిలగడదుంపలో బీటాకెరోటిన్ అధికమొత్తంలో లభిస్తుంది. ఆహారం ద్వారా మనం తీసుకొన్న బీటా కెరోటిన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత విటమిన్ 'ఎ'గా రూపాంతరం చెందుతుంది. ఇది కురుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ దుంపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన కేశసంపదను పొందవచ్చు.
టొమాటోల్లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పాడైపోయిన కురులకు తిరిగి జీవం పోయడంలో సహకరిస్తాయి. అంతేకాదు జుట్టు, మాడుపై చేరిన టాక్సిన్లు, ఇతర మలినాలను తొలగిస్తాయి. దీనికోసం టొమాటోలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే అప్పుడప్పుడూ టొమాటో గుజ్జుని హెయిర్‌ప్యాక్‌లాగా వేసుకోవాలి. దీనివల్ల జుట్టు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
- ఆహారం ద్వారా శరీరానికి అధికంగా లభించే లైకోపిన్ శిరోజాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది బీట్‌రూట్‌లో అధికంగా లభిస్తుంది.
- వెల్లుల్లిలో వెంట్రుకల ఎదుగుదలకు తోడ్పడే సల్ఫర్ అధిక మొత్తంలో లభ్యమవుతుంది. కాబట్టి దీన్ని కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
- చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ వీటిలో జుట్టు రాలిపోవడాన్ని తగ్గించే సుగుణాలున్నాయి. వీటి ద్వారా మనకు లభించే కెరోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహకరిస్తుంది.
- పచ్చి బఠానీలో విటమిన్ 'సి' ఎక్కువగా లభిస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
- గుమ్మడి, అవిసె గింజలు సైతం కురులు దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఇ, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్, కాపర్‌తో పాటుగా ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యమవుతాయి. వీటిని రోజూ ఆహారంగా తీసుకొంటే.. జుట్టు రాలే సమస్య పూర్తిగా నయమవుతుంది.
ఇదీ చూడండి: గర్భనిరోధక పద్ధతుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?