దంపతులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తరచూ లైంగిక చర్యలో పాల్గొంటూ ఉంటే నూటికి డెబ్బైశాతం మందికి ఏడాదిలో గర్భం నిలుస్తుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఏడాదిపాటు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా తరచూ లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ గర్భం రాకపోతే తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి. ఆలస్యంగా పెళ్లిచేసుకున్నప్పుడు, నెలసరిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పుడు, ఇంతకు ముందే ఎండోమెట్రియోసిస్ లేదా పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) ఉన్నట్లుగా నిర్ధారణ అయితే డాక్టర్లను సంప్రదించాలి. అదే మగవారు వృషణాల(టెస్టిస్)కు, ప్రోస్టేట్ గ్రంథికి జబ్బులు వచ్చి ఉంటే లేదా వాటికి శస్త్రచికిత్సలు చేయించుకునప్పుడు, టెస్టిస్ పరిమాణం చిన్నగా ఉన్నా లేదా స్క్రోటమ్‌లో వాపులున్నా చికిత్స అవసరం.
కారణాలేంటి?
పెళ్లయ్యి ఏళ్లు గడుస్తున్నా... ఆ మహిళ గర్భం దాల్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్ఛు సాధారణంగా గర్భం నిలవాలంటే... స్త్రీ నుంచి విడుదలైన అండం పురుషుడి వీర్యకణంతో కలిసి ఫలదీకరణం జరిగి గర్భాశయంలో సక్రమంగా పెరిగినప్పుడు గర్భం నిలుస్తుంది. ఈ సమస్య భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఉండొచ్ఛు శారీరక లోపాలే కాదు...అధికబరువు, వయసు, పోషకాలలోపం, వంటివీ సమస్యకు మూలం కావొచ్ఛు వ్యాయామం చేయకపోవడం లేదా ఎక్కువగా వర్కవుట్లు చేయడం... ఇవన్నీ సంతాన లేమికి దారితీయొచ్ఛు.
మహిళల్లో...
అండం విడుదలలో లోపాలు:
నెలసరి సమయంలో అండం విడుదల కానప్పుడు, హార్మోన అసమతుల్యత, ముఖ్యంగా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నప్పుడు, పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు కూడా అండాశయాలు సరిగా పనిచేయవు. వయసు పైబడిన మహిళల్లో, జన్యుసంబంధిత సమస్యల వల్ల కొందరిలో అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోతాయి..
గర్భాశయంలో లోపాలు:
గర్భాశయంలో లేదా గర్భాశయ ద్వారమైన సర్విక్స్‌లో పాలిప్స్, ఫైబ్రాయిడ్ గడ్డలు, ఇన్‌ఫెక్షన్‌లు, గర్భాశయ ఆకృతిలో తేడాలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది.
ఫెల్లోపియన్ ట్యూబ్స్‌లో లోపాలు :
వీటిని అండవాహికలు అంటారు. గర్భం నిలవడంలో వీటిది ప్రధాన పాత్ర. వీటిలో అడ్డంకులు ఏర్పడినా, ఇన్‌ఫెక్షన్‌లున్నా గర్భం నిలవకపోవడం, నిలిచినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి దారితీయొచ్ఛు ఎండోమెట్రియోసిస్ కూడా సంతానలేమిని కలిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
క్రోమోజోమ్‌లలో లోపాలు:
స్త్రీకి ఉండాల్సిన క్రోమోజోమ్‌ల్లో తేడాలున్నప్పుడు టర్నర్ సిండ్రోమ్, ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వంటివి ఇన్‌ఫెర్టిలిటీకి దారి తీస్తాయి. స్టిరాయిడ్లు, నొప్పి నివారణా మందులు వినియోగించినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది.
పురుషుల్లో...
వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలిక లేకపోవడం, అసాధారణంగా తయారుకావడం, వీర్యకణాలన్నీ సరిగానే ఉన్నా యోనిలోకి చేరలేకపోవడం. అలాగే వృషణాలకు సంబంధించిన క్యాన్సర్లు, వాటి చికిత్సల వల్ల ఇలా జరుగుతుంది. టెస్టోస్టిరాన్, ఇతర హార్మోన్ల పనితీరు, క్లమీడియా వంటి వ్యాధులు కూడా సంతాన లేమికి కారణం అవ్వొచ్ఛు.
ఇద్దరికీ చికిత్స
అండం విడుదలయ్యే సమయంలో లైంగిక చర్యలో పాల్గొనమని మొదట సూచిస్తారు. ఆపై సంతాన సాఫల్య సామర్థ్యం పెరిగేందుకు మందులు సిఫారుసు చేస్తారు. ఫెల్లోపియన్ ట్యూబులు మూసుకుపోతే శస్త్రచికిత్స, ఎండోమెట్రియాసిస్ అయితే ల్యాపరోస్కోపీ ద్వారా నయం చేస్తారు. ఒకవేళ మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలికల లేకపోవడం వంటి సందర్భాల్లో గర్భసంచిలోకి ఇంట్రా యూటరైన్ ఇన్‌సెమినైజేషన్‌ని పరికరం ద్వారా నాణ్యమైన వీర్యకణాలను సేకరించి పంపిస్తారు. ఇవేకాదు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్, అసిస్టెడ్ హ్యాచింగ్ వంటి పద్ధతుల్ని ఎంచుకుంటారు.