ప్రశ్న: ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ మూడో దశ ప్రారంభమైందా.. చిన్నారులకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
- రమేష్, శాంతినగర్, నల్గొండ; శ్రీనివాస్, డిండిరోడ్డు, దేవరకొండ; రాజ్యలక్ష్మి, గోల్డ్‌బజార్ మిర్యాలగూడ.
డాక్టర్: మూడో దశ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కానీ అక్కడక్కడ కొంత మంది చిన్నారుల్లో లక్షణాలు కన్పిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ప్రతి రోజు చిన్నారులకు పాలు, గుడ్లు, పండ్లు వంటి పౌష్టికాహారం అందించాలి. జంక్‌ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు.
ప్రశ్న: ఇంట్లో పెద్దలకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. చిన్నపిల్లలున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-ఎండీ జలీల్‌పాష, సాగర్‌రోడ్డు నిడుమనూరు; ఆంజనేయులు జి.యడవెల్లి, కనగల్; అనురాధ రామగిరి, నల్గొండ.
డాక్టర్: ఇంట్లో పెద్దలకు ఎవరికైనా కొవిడ్ వస్తే చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో వారిని కలువనీయ కూడదు. కొవిడ్ వచ్చిన వారిని గాలి, వెలుతురు ఉండే గదిలో ప్రత్యేకంగా ఉంచి వైద్యుడి సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం మంచిది. అలాంటి వసతులు లేనివారు ప్రభుత్వ ఐసోలేషన్‌లో ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో కూలర్లు వాడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కూలర్ల నుంచి వచ్చే తుంపర్ల వల్ల జలుబు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి.
ప్రశ్న: కరోనా ఉద్ధృతి కారణంగా మా పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారు. దీంతో వారికి శారీరక వ్యాయామంతో పాటు డీ విటమిన్ కూడా అందడం లేదు. ఏం చేయాలి?
-నాగలక్ష్మి, షాబూనగర్, మిర్యాలగూడ, ఎస్.మంగమ్మ, చర్లపల్లి, నల్గొండ; వారం పిచ్చయ్య, మేళ్లచెర్వు.
డాక్టర్: చిన్నారులను ఉదయం 10 గంటలలోపు కొంత సేపు ఎండలో తిప్పండి. ఇళ్ల ముందు అవకాశం లేకపోతే మిద్దె మీదికి తీసుకెళ్లి తిప్పే ప్రయత్నం చేయండి. విటమిన్ డీ సిరఫ్ ఆల్ట్రా డీ 5 మి.లీ. వారం రోజుల పాటు ఇవ్వండి. పిల్లలు గుంపులుగుంపులుగా కలిసి ఉండకుండా చూసుకోవాలి. బయట లభించే జంక్‌ఫుడ్ కాకుండా ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారమే పిల్లలకు ఇవ్వాలి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పిల్లలను తిప్పకపోవడం మంచిది.
ప్రశ్న: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులను విద్యాసంస్థలకు పంపవచ్చా?
-రాజ్‌కుమార్, నల్గొండ; వినోద శాంతినగర్; విక్రమ్‌కుమార్ మాడ్గులపల్లి.
డాక్టర్: ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను విద్యాసంస్థలకు పంపకూడదు. ఆన్‌లైన్ క్లాసులే శ్రేయస్కరం. పిల్లలు గుంపుగా ఉండటం మూలంగా కొవిడ్ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించడం మంచిది.
ప్రశ్న: మూడో దశలో కొవిడ్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
-ఎం.శ్రీనివాసులు, చర్లపల్లి, నల్గొండ; రామకృష్ణ, పానగల్, నల్గొండ; వెంకట్‌రెడ్డి, వేములపల్లి.
డాక్టర్: మూడో దశలో శరీరంలోని ఏ అవయవంపైౖన అయినా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. చిన్నారుల్లో ఎక్కువగా రక్తనాళాలు గడ్డకట్టడం, గుండె, మూత్రపిండాలు పనిచేయక పోవడం వంటివి సంభవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి వస్తే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. వైరస్ సోకిన తర్వాత ఇబ్బంది పడేకంటే రాకుండా తగిన జాగ్రత్తలు పాటించడమే అందరి లక్ష్యం కావాలి.
ప్రశ్న: ప్రస్తుతం కొవిడ్ ఏ వయసు ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది?
-జి.సంజన శ్రీనగర్ కాలనీ నల్గొండ, ఎన్ వెంకటేశ్, కేతేపల్లి, ఎన్.రాము, నార్కట్‌పల్లి
డాక్టర్: కొవిడ్‌కు వయసుతో పనిలేదు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు కొవిడ్ సోకే ప్రమాదం ఉంది. అయితే 14 ఏళ్లలోపు చిన్నారులపై దీని ప్రభావం తక్కువగా ఉంటోంది. చిన్నారులకు కొవిడ్ లక్షణాలు కన్పిస్తే పెద్దవాళ్లు వారిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాల స్థాయిని బట్టి వైద్యుడి సలహామేరకు చికిత్స అందించాలి.
ప్రశ్న: తల్లికి కరోనా వస్తే పాలు ఇవ్వకూడదని అంటున్నారు. ఇది నిజమేనా?
-శ్రీదేవి, హైదరాబాద్ రోడ్డు నల్గొండ; విశ్వనాథం, దేవరకొండ; వెంకటలక్ష్మి, కడపర్తి రోడ్డు నకిరేకల్; కె.మాధవి, నాంపల్లి; ఎస్. విజయలక్ష్మి, నారాయణపురం; ఎండీ ఖాదర్ హాలియా.
డాక్టర్: తల్లి చనుబాలతో శిశువుకు కరోనా రాదు. తల్లి పాలకు మించిన పౌష్టికాహారం మరోటి లేదు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వకపోవడం నేరమే అవుతుంది. తల్లికి జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉంటే ముఖానికి రెండు మాస్కులు ధరించి బిడ్డకు పాలు ఇవ్వొచ్ఛు పాలు ఇచ్చిన తరువాత కొంచెం దూరంగా పడుకోబెట్టాలి. ఇంట్లో అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ వైద్యుల సూచనలు పాటించాలి.
ఇదీ చదవండి: Vaccine drive: హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం