రకరకాల కారణాల వల్ల ఈతరం యువత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి పెళ్లి విషయంలో చాలా అనుమానాలు తలెత్తుతాయి. ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఇలాంటి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. పిలల్ని కనలేమా? లైంగిక ఆనందం పొందలేమా? శృంగారం మీద ఆసక్తి సన్నగిల్లుతుందా? అని అనేక డౌట్లు మెదళ్లను తొలుస్తాయి. ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ జి. సమరం సమాధానాలు ఇవే..
ఆలస్యంగా పెళ్లైతే.. పిల్లల్ని కనలేరా..
లేట్‌గా మ్యారేజ్ చేసుకుంటే కచ్చితంగా పిల్లల్ని కనవచ్చు అంటున్నారు నిపుణులు. '40 ఏళ్లు పైబడిన తర్వాత వివాహం చేసుకుంటే.. ప్రెగ్నేన్సీ వస్తుంది. కానీ కొంతమందిలో జన్యువుల కారణంగా పిల్లలు జెనెటిక్ సమస్యలతో పుట్టే అవకాశముంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. టిఫా(టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ అనామలిస్) స్కాన్ చేసి జన్యు సమస్యలను గుర్తించవచ్చు. అయితే చాలా వరకు జెనెటిక్ సమస్యలు సాధారణమైనవి. ఒకవేళ జన్యు సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే.. బిడ్డను ఉంచుకోవాలా లేదా అనేది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది. అలాగే మహిళలు పిల్లల్ని కనడానికి 20 నుంచి 35 ఏళ్ల వయసు సమయం చాలా ముఖ్యం. ఈ సమయంలో పిల్లల్ని కంటే.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లుల్లో కూడా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ రావు. ఇంకా చెప్పాలంటే 28-30 ఏళ్లలో పిల్లల్ని కనడం ఉత్తమం'. అని సూచిస్తున్నారు.
40 ఏళ్లు దాటితే.. మహిళల్లో సెక్స్‌పై ఆసక్తి తగ్గుతుందా?
'40 ఏళ్లు దాటితే మహిళల్లో లైంగికాసక్తి తగ్గుతుంది. పురుషుల్లో టెస్టో స్టిరాన్ హార్మోన్లు తగ్గినట్లుగా.. మహిళల్లో ఈస్ట్రోజెన్ హర్మోన్లు తగ్గుతాయి. దాదాపు ఈ వయసులోనే మెనోపాజ్( స్త్రీ పునరుత్పత్తి) తగ్గిపోతుంది. ఎప్పుడైతే హార్మోన్లు తగ్గుతాయో.. అప్పటినుంచి సెక్స్‌పై ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. దీంతో పాటు ఇదే వయసులో బీపీ, షుగర్ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. ఆరోగ్యంగా అంత యాక్టివ్‌గా ఉండలేరు. ఈ కారణంగా కూడా శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది'.