కొవిడ్ అత్యవసర చికిత్సలో వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ (remdecivir treatment) ఇస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చికిత్స సమయంలో రోగి గుండె వేగం తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్-19 చికిత్సలో వైరస్ వృద్ధిని తగ్గించటానికి రెమ్‌డెసివిర్ మందును విరివిగా వాడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే దీని వాడకంలో కాస్త జాగ్రత్త అవసరమని హార్ట్ రిథమ్ సొసైటీ పత్రికలో ప్రచురితమైన ఉదంతం ఒకటి పేర్కొంటోంది.
తీవ్రమైన ఆయాసంతో వచ్చిన ఒకామెకు అమెరికాలోని రీజినల్ మెడికల్ సెంటర్ బేయోనెట్ పాయింట్ వైద్యులు కొవిడ్-19 ఉందని నిర్ధరించుకున్నాక రెమ్‌డెసివిర్ చికిత్స ఆరంభించారు. అయితే 24 గంటల తర్వాత రక్తపోటు, గుండె వేగం పడిపోవటం కలవరం కలిగించింది. గుండె నిమిషానికి 38 సార్లే కొట్టుకుంటున్నట్టు గుర్తించారు. అంతకుముందు ఆమెకు ఎలాంటి గుండెజబ్బులూ లేవు. రెమ్‌డెసివిర్ ఇవ్వటానికి ముందు ఈసీజీ వంటి పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. గుండె వేగం తగ్గటం రెమ్‌డిసివిర్ (remdecivir treatment) ప్రభావంతోనే అని అనుమానించిన వైద్యులు వెంటనే సెలైన్ ద్వారా డొపమైన్ ఇవ్వటం ఆరంభించారు. దీంతో గుండె వేగం తిరిగి మామూలు స్థాయికి వచ్చింది.
రెమ్‌డెసివిర్ చివరి మోతాదు ఇచ్చిన 18 గంటల తర్వాతే డొపమైన్ ఆపేశారు. ఆమె జబ్బు నుంచి కోలుకున్నారు. గుండె పనితీరూ కుదుట పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే రెమ్‌డెసివిర్ ఇచ్చే సమయంలో గుండె పనితీరును గమనిస్తూ ఉండటం మంచిదని, వేగం తగ్గితే అవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ఒకవేళ అప్పటికే గుండె జబ్బులు ఉన్నట్టయితే మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆరోగ్యానికి పోషకాహారం- జబ్బులు మటుమాయం