ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ తప్పకుండా తీసుకోవాలి. టీకా తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఎలాంటి భయాలూ అక్కర్లేదు. కిడ్నీజబ్బులు గలవారికి, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కొవిడ్-19 బారినపడే ముప్పు పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ తలెత్తితే అది జబ్బుగా, తీవ్రంగా మారే ప్రమాదమూ ఎక్కువే. అప్పుడు వీరికి చికిత్స చేయటమూ కష్టమే. కొవిడ్-19 తీవ్రమైనవారికి స్టిరాయిడ్లు వాడాల్సి వస్తోంది. వీటితో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల ముందే టీకా తీసుకోవటం మంచిది. ఇది ఇన్‌ఫెక్షన్ నివారణకే కాదు, జబ్బు తీవ్రంగా మారకుండానూ కాపాడుతుంది.
ఇక ఒక కిడ్నీ గలవారికి రెండు కిడ్నీలు ఉన్నవారిలో మాదిరిగా అదనపు రక్షణ ఉండదు. నిజానికి పుట్టుకతోనే ఒక కిడ్నీ గలవారిలో చాలామందికి ఆ విషయమే తెలియదు. ఇతరత్రా జబ్బుల పరీక్షల కోసం వెళ్తే బయటపడుతుంటుంది. ఇలాంటివాళ్లు ఆరోగ్యంగానే ఉండొచ్చు. పైకి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవచ్చు. కానీ ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు రెండో కిడ్నీతో లభించే రక్షణ కొరవడుతుంది. ఆయా సమస్యలను తట్టుకునే శక్తీ అంతగా ఉండకపోవచ్చు. అందువల్ల నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా టీకా తీసుకోవటమే ఉత్తమం.