24 లక్షల మందికి ఆహారం, 2.30 లక్షల కుటుంబాలకు చేయూత, 12.41 లక్షల భోజనాల పంపిణీ, 10వేల మంది దినసరి కూలీలకు 1,000 చొప్పున సాయం.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ దాతృత్వమిది! ఈ సాయం వెనుక ఓ తల్లి హృదయం ఉంది. సుధామూర్తి దానశీలత కరోనా వేళ మరోసారి రుజువైంది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ లక్ష్యం రూ.100 కోట్ల సాయం. సంకల్పం బలంగా ఉంటే.. లక్ష్యం చిన్నదైపోతుంది. సుధామూర్తి అనుకున్నది దాటేశారు. రూ.100 కోట్లు.. కాస్తా రూ.120 కోట్లు అయింది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ నిర్వహిస్తున్న ఫౌండేషన్‌కు వంద కోట్లు ఖర్చుచేయడం పెద్ద విషయమేం కాకపోవచ్చు. కానీ, దానిని ఎలా వినియోగిస్తున్నారన్నదే ముఖ్యం. ఈ విషయంలో సుధామూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా చేసిన, చేస్తున్న, చేయదలచిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటున్నారు.
బెంగళూరులో ఆస్పత్రి..
కొవిడ్-19 ఉగ్రరూపు దాల్చే క్రమంలో బెంగళూరులో ఓ ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పారు సుధామూర్తి. అన్నట్టుగానే వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో దీనిని ఇటీవలే ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రులకు పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర సామగ్రిని కూడా అందజేసేలా ప్రణాళికలు రూపొందించారామె. క్వారంటైన్ సెంటర్, ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు ప్రధానమంత్రి సహాయనిధి ‘పీఎం కేర్స్’కు రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారు.
సరైన మార్గంలో చేస్తేనే..
పైకం ఉండగానే సరిపోదు. దానిని సరైన మార్గంలో ఖర్చు చేయాలి. అందాల్సిన వారికి చేరేలా చూడాలి. ఇప్పుడు అదే పనిని సమర్థంగా చేస్తున్నారు సుధామూర్తి. ప్రతి రూపాయినీ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా వెచ్చిస్తున్నారు. 142 వెంటిలేటర్లు, 26 మల్టీపారా పేషంట్ మానిటర్స్, 14వేల లీటర్ల శానిటైజర్, 40వేల పీపీఈ కిట్లు, రెండున్నర లక్షల చేతి తొడుగులు, 32వేల ఎన్95 మాస్కులు ఇలా అక్కరకు వచ్చే చేయూతనందిస్తున్నారు. రెండు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైప్‌లైన్ వసతి కల్పిస్తున్నారు. నిరుపేదలకు ప్రత్యక్ష సాయం చేస్తున్నారు. లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఆహార పదార్థాలు, భోజనాలు ఇలా.. క్షేత్రస్థాయిలో ఎక్కడ అవసరం ఉందో గుర్తించి ఫౌండేషన్ సేవలు కొనసాగిస్తున్నారు.
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసొచ్చారు సుధామూర్తి. ఒడుదొడుకుల్లోనూ కుదురుగా ఉన్నారు. తన భర్త నారాయణమూర్తి విజయంలో వెనకే ఉన్నారు. ఆయన్ను ముందుకు నడిపించారు. ఒక ఇల్లాలిగా, తల్లిగా అనురాగ సుధలు పంచిన ఆమె.. రచయిత్రిగా ఎందరికో ఆదర్శం. దాతృత్వంలో ఎప్పుడూ ముందుండే సుధామూర్తి.. ఏ విపత్తు వచ్చినా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అండగా ఉంటుందని నిరూపించారు.