ఇంటి పెరట్లో సరదాగా ఓ కుటుంబం ఆడిన క్రికెట్ ఇప్పుడు నెట్టింట్లో 'వ్యూస్' రూపాన పరుగుల వరద కురిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు మరి. చేతిని గింగిరాలు తిప్పుతూ ఓ 50 ఏళ్ల మహిళ వేసిన బౌలింగ్‌కి నెటిజన్లంతా బౌల్డ్ అయ్యారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బిందూ బౌలింగ్ చేస్తే..
కేరళలోని పాలక్కాడ్ జిల్లా మెజత్తూర్ గ్రామానికి చెందిన రామన్ నంబూద్రి (58) భారత సైన్యంలో సేవలందించి రిటైర్ అయ్యారు. ఆయన సతీమణి బిందు ఓజుకిల్ (50) సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఏం చేయాలో పాలుపోని వారు.. తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఈ క్రమంలో వారు చిన్నప్పుడు ఆడిన క్రికెట్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆటలో వారి సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకుందాం అనుకున్నారో ఏమో.. ఇంటి పెరట్లో పిల్లలతో కలిసి ఆట ప్రారంభించారు. కాసేపటికి బౌలింగ్ వేసే వంతు బిందు చేతికి వచ్చింది.
బిందు వేసిన బంతిని చూసి పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్‌గా చేతిని మెలికలు తిప్పుతూ వేసిన తీరుకు ఫిదా అయిపోయారు. దీనికి నంబూద్రి ఆడిన డిఫెన్స్ మరింత ఆకర్షణను చేకూర్చింది. వెంటనే వారి చిన్నబ్బాయి నవనీత్ కృష్ణన్ ఈ మ్యాచ్‌ని సెల్‌ఫోన్‌లో బంధించి సరదాగా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు.
బిందు బౌలింగ్‌కి ఫిదా అయిన నెటిజన్లు దీన్ని విపరీతంగా షేర్ చేయసాగారు. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నంబూద్రి స్పందిస్తూ సరదాగా తీసిన వీడియోకు ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదన్నారు. బంధువులు, మిత్రులంతా ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారని తెలిపారు. 27 ఏళ్ల దాంపత్య జీవితంలో బిందు క్రికెట్ నైపుణ్యాన్ని ఎప్పుడూ గమనించలేదని.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో ఆమె కూడా ఓ ప్లేయర్‌గా చేరనుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:సుఖీభవ: పెరటి వైద్యం.. ఆరోగ్యానికి ఎంతో లాభం