ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేవరకు కరోనాను ఎదుర్కొనేందుకు ఇదే చక్కని ఔషధమని చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తికి సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ దీప్తి వర్మతో 'ఈటీవీ భారత్' మాట్లాడింది. ఆమె చెప్పిన విషయాలు, సూచనలు మీకోసం..
ప్రశ్న: రోగ నిరోధక శక్తి ఎలా పని చేస్తుంది? కరోనా లాంటి వైరస్ ఇన్ఫెక్షన్లను తట్టుకునేలా సామర్థ్యాన్ని పెంచుకోవటం సాధ్యమేనా?
జ: ఒక వేళ వ్యాక్సిన్‌ను కనిపెట్టినా అది వైరస్‌పై 100శాతం పనిచేయదు. ఎందుకంటే వైరస్ రక్తం ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తుంది. కణ కేంద్రాలపై దాడి చేస్తుంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వ్యక్తి శరీరంలో ప్రవేశించినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి.
అందువల్ల ఈ రోజుల్లో శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవటం చాలా అవసరం. అప్పుడే వైరస్, బ్యాక్టీరియాలపై పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, సరైన ఆహారం తీసుకోవటం, మంచి జీవన శైలిని అనుసరించటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా రోజువారీ అలవాట్లు మార్చుకోవాలి. ఉదాహరణకు.. సూర్యోదయం సమయానికి నిద్ర లేవటం, చీకటి పడ్డాక 3,4 గంటల్లోపు నిద్రపోవటం మంచిది. ఉదయం సమయంలో సూర్యరశ్మి వల్ల తెల్ల రక్త కణాలకు శక్తి లభిస్తుంది. జీవన శైలి, ఆహార సమయాలు, సమయానికి నిద్ర పోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఆయుర్వేద పద్ధతులను అభివృద్ధి చేయాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఈ సలహా కార్యరూపం దాల్చుతుందని మీరు భావిస్తున్నారా?
జ: ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రాముఖ్యాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆయుర్వేద పద్ధతులు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ భారత్‌లోని చాలా మందికి దీనిపై అవగాహన లేదు. భారత్‌కు ఆయుర్వేదం ఆధారం వంటిది. వంటల్లో వేసే గరం మసాలాలో యాలకులు, దాల్చిన చెక్క వాడతారు. వీటితో అనేక ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. భారతీయుల వంటగది ఒక ఔషధాలయం.
ఎన్నో ఉపయోగాలు ఉన్న పసుపు.. దేశంలో సమృద్ధిగా ఉంది. కానీ మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. పసుపు కొమ్ములను ఛాయ్‌లో వేసుకుని తాగటం చాలా మంచిది. అల్లం ముక్కలను మరిగించిన నీటిని తాగాలి. ఇలాంటివి వైరస్‌పై పోరాడేందుకు ఇది చాలా ఉపయోగపడతాయి. ఈ ద్రావణాన్ని రోజు రెండు పూటలు తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. పసుపులోని కర్కమిన్ అనే పదార్థానికి వైరస్‌ను సంహరించే శక్తి ఉంది. ప్రాణాంతక కణితులకు చికిత్స చేసే కీమోథెరపీ తరహాలో ఇది పనిచేస్తుంది. కణితులను నియంత్రించేందుకు కూడా పసుపు ఉపయోగపడుతుంది.
రెండోది దాల్చిన చెక్క.. అనేక అద్భుతాలు చేయగలదు. ఇందులో 'కమాడియన్' అనే జీవ క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచటమే కాక చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చనిపోయిన ప్లేట్లెట్లను తొలగిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
తులసి ఆకు.. మంచి యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. తెల్లరక్త కణాల్లో యాంటీబాడీలను పెంచి జ్వరాన్ని తగ్గించేందుకు లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఆయుర్వేద పదార్థాలు వైరస్‌పై పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తాయి.
ప్రశ్న: ఆహారం ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా చేస్తుందనటంలో సందేహం లేదు. కానీ లాక్డౌన్ సమయంలో చాలా మంది ఆహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఏవైనా అనారోగ్యం వస్తుందా? దీనిపై మీరేం సూచనలు చేస్తారు?
జ: దీని వెనుక సైన్స్ ఉంది. ఆకలి, దప్పిక గ్రాహకాలు చాలా దగ్గరిగా ఉంటాయి. మనకు దాహం వేసినప్పుడు ఆకలి సూచనలు కూడా కనిపిస్తాయి. నీళ్లు తాగాలని మెదడు సూచించినా ఆహారాన్నీ తీసుకుంటాం. దీన్ని మనం నివారించుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగటం అలవాటు చేసుకోవాలి. నడవటం, వ్యాయామం, యోగా, ధ్యానం వల్ల ఆకలి సూచించే హార్మోన్ల విడుదలను తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా ఏ పని చేయకుండా నిశ్చలమైన జీవన శైలిని అలవాటు చేసుకోకూడదు.
ప్రశ్న: రోగ నిరోధక శక్తి సమతుల్యంగా ఉండేందుకు ఉపయోగపడేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?
జ: ఈ చిట్కాలు పాటించండి..
- తేనె కలిపిని పసుపు టీని రోజుకు రెండు సార్లు తాగాలి. అల్లం, వెల్లుల్లి వంటివి కూడా మేలు చేస్తాయి.
- సీజనల్ పండ్లను రోజుకు రెండు తినాలి.
- ఇంట్లో చేసిన వంటకాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. చపాతీలు, కూరగాయల భోజనం తీసుకుంటే మంచిది. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.
- వేరుశనగ, అవిసెలు ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలను సరఫరా చేస్తాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కణాల్లోకి ఎలాంటి క్రిములను ప్రవేశించనివ్వదు. బాదం, వాల్‌నట్స్‌లో ఒమెగా- 3 అధికంగా లభిస్తుంది.
- శరీరాన్ని అంతర్గతంగా సలాడ్లు శుభ్రం చేస్తాయి.
- నీళ్లు ఎక్కువగా తాగడం, సరైన నిద్ర తప్పనిసరి.
ఆలస్యంగా తినటం వల్ల చాలా గుర్తుతెలియని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దేశంలో చాలామంది దీని వల్ల బాధపడుతున్నారు. దీనిపై అవగాహన కల్పించటం చాలా అవసరం. తటస్థ జీవన విధానమే ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు సహకరిస్తాయి.