యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న వలయ రహదారి పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం పట్టణంలో మినహా మిగతా ప్రాంతాల్లో పనులు పూర్తి దశకు చేరాయి. ప్రధానంగా యాదగిరి పల్లి నుంచి వైకుంఠ ద్వారం, వైకుంఠ ద్వారం నుంచి ఆర్యవైశ్య సంఘం భవనం వరకు మాత్రమే కిలోమీటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ఆగాయి. ఇక్కడ రోడ్డు నిర్మించడం వల్ల, పలువురి ఇళ్లు, దుకాణాలు తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. బాధితులకు నష్ట పరిహారం ఎంత ఇవ్వాలో నిర్ణయించకపోవడంతో భూసేకరణ ఆలస్యమైంది. అందువల్లే పనులను అంసపూర్తిగా వదిలేశారు. ఇక్కడ విస్తరణను పూర్తి చేసేందుకు, నష్టపరిహారంపై చర్చించేందుకు, ఇళ్లు, దుకాణాల బాధితులకు తాజాగా భువనగిరి ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.
నేడు పరిహారంపై చర్చ
రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారు తమ ధ్రువ పత్రాలతో భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని గత ఏప్రిల్లో రెవెన్యూ అధికారులు బాధితులకు సూచించారు. ఈ నెల 25న రోడ్డు విస్తరణ బాధితులు భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో తాజాగా నోటీసు ఇచ్చారు. వైకుంఠ ద్వారం నుంచి యాదగిరి పల్లి మసీద్ వరకు ఇరువైపులా రోడ్డు విస్తరణ చేస్తామని గతంలో ఆర్అండ్బీ అధికారులు చెప్పారని... ఇప్పుడు రోడ్డుకు ఒక వైపు మాత్రమే రోడ్డును విస్తరించడం వల్ల 35 మంది ఇల్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ఎంతమేర విస్తరిస్తారో చెప్పాలని, సీఎం కేసీఆర్ హామీ మేరకు నష్టపరిహారం ఇస్తేనే... రోడ్డు విస్తరణకు ఒప్పుకుంటామని బాధితులు చెబుతున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు తామేం వ్యతిరేకం కాదని.. కాకపోతే... ఇళ్లు, దుకాణాలు కోల్పోయే వారికి న్యాయం చేయాలని కోరుతున్నట్లు రోడ్డు విస్తరణ గృహ బాధితుల సంఘం అధ్యక్షుడు రాగి సహదేవ్ తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్ట పరిహారం చెల్లించాకే... భూసేకరణ చేపడతామని కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ విషయంపై బాధితులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..