యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై కల్వర్టులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ రక్షణ గోడలు దెబ్బతింటున్నాయి. వంతెనలు ఇరుకుగా ఉండటంతో వాహనాలు ఢీకొంటున్న ఘటనలు(ROAD ACCIDENTS) తరుచూ జరుగుతున్నాయి. రోడ్డు ఇరుకైన చోట విస్తరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వాహనాలు ఢీకొని కల్వర్టులు కూలిపోవడం... వాటికి మరమ్మతులు చేయడం ఆ తర్వాత నాలుగు రోజులకే అవి మళ్లీ కూలిపోవడం నిత్యకృత్యంగా మారిపోయిందని అంటున్నారు.
వాసాలమర్రిలో అస్తవ్యస్తం
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దత్తత తీసుకున్న వాసాలమర్రి(VASALAMARRI) గ్రామం వద్ద కల్వర్టు ఇరువైపులా కూలిపోయింది. పదిహేను రోజులకో వాహనం అక్కడ బోల్తా పడుతోందని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రమాదాలకు(ACCIDENTS) గురవుతున్నాయి. అక్కడ కల్వర్డు ఉందనే విషయం వాహనదారులకు కనిపించని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
ఇరుకైన కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రమాదాలను అరికట్టాలి. పల్లెపహాడ్, వాసాలమర్రి, తిర్మలాపూర్, వీరారెడ్డిపల్లి, పీర్లపల్లి (జగదేవపూర్ మండలం శివారు)వద్ద చిన్న వంతెనలు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయాలి. నిత్యం భారీ వాహనాలు తిరిగే ఈ రహదారిని విస్తరించాలి.
-స్థానికులు
నిర్లక్ష్యమేనా?
అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారి వల్ల ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం దత్తత తీసుకున్న నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు నిత్యం వస్తున్నా... ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం లేదని అంటున్నారు.
భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై కల్వర్టులు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం.
-ఉమాదేవి, ఎంపీడీవో, తుర్కపల్లి
ఇదీ చదవండి: విరిగిపడ్డ కొండచరియలు.. భయంతో పరుగెత్తిన ప్రజలు