Pongal Special Sweet Recipes : సంక్రాంతి పండగ సమయంలో అరిసెలు, జంతికలు, పప్పుచెక్కల్లాంటి వివిధ రకాల పిండి వంటలు చేసుకోవడం మామూలే. అవి మాత్రమే కాకుండా భోగి రోజున తెలంగాణలో "పులగం" అనే స్వీట్ రెసిపీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పటిలాకాకుండా ఈ పండక్కి కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. అందుకోసం రెండు సూపర్ రెసిపీలను తీసుకొచ్చాం. ఇవి చాలా రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా చాలా తక్కువ సమయంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, ఆ నోరూరించే ఆ స్వీట్ రెసిపీలేంటో ఇప్పుడు చూద్దాం.
అమ్మమ్మల కాలం నాటి స్వీట్ పులగం :
కావాల్సిన పదార్థాలు :
- పొట్టు పెసరపప్పు - అరకప్పు
- బియ్యం - అరకప్పు
- బెల్లం - ఒకటిన్నర కప్పులు
- యాలకులు - 4
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- ఎండుకొబ్బరి ముక్కలు - కొన్ని
సంక్రాంతి స్పెషల్ : సూపర్ టేస్టీ "కొబ్బరి బూరెలు" - అరిసెలు రానివారు ఈజీగా చేసేయొచ్చు!
తయారీ విధానం :
- ముందుగా ప్రెషర్ కుక్కర్లో పొట్టు పెసరపప్పు, బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. అనంతరం మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఆపై ఇంకో బర్నర్ మీద ఒక గిన్నెలో బెల్లం, అరకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు మరిగించుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పును కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్‌ని వడకట్టి పోసుకోవాలి.
- అలాగే, యాలకులను మెత్తగా పొడి చేసి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై లో ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై మరో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే డ్రైఫ్రూట్స్‌ని నెయ్యిలో వేయించుకొని పులగంలో యాడ్ చేసుకోవచ్చు.
- అవి వేగిన తర్వాత ఇంకో బర్నర్ మీద ఉడికించుకుంటున్న పులగంలో వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆపై కాసేపు సన్నని సెగ మీద ఉంచి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే అమ్మమ్మల కాలం నాటి నోరూరించే "పులగం" రెడీ!
సంక్రాంతికి ఈ పద్ధతిలో "రవ్వ లడ్డూలు" చేసుకోండి - నెల రోజులు మెత్తగా, తాజాగా ఉంటాయి!
స్పైసీ పులగం :
కావాల్సిన పదార్థాలు :
- పొట్టు పెసర్లు - అరకప్పు
- బియ్యం - 1 కప్పు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- మిరియాలు - అరటీస్పూన్
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- టమాటా - 1
పాకం లేకుండానే "కమ్మటి అరిసెలు" ఇలా చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతాయి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా వేర్వేరు బౌల్స్‌లో పొట్టు పెసర్లు, బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
- ఆపై మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి.
- ఆవిధంగా ఉల్లిపాయ ముక్కలు ఉడికాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి అవి సాఫ్ట్‌గా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం అందులో గంట పాటు నానబెట్టుకున్న పెసర్లు, బియ్యాన్ని వాటర్ వడకట్టి వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- బియ్యంలోని చెమ్మ అరిపోయాక మూడు కప్పుల వరకు వాటర్ పోసి కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక మూతతీసి చూస్తే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "రాయలసీమ స్టైల్ పులగం" రెడీ!
- ఇందులోకి పల్లీ పచ్చడి సూపర్ కాంబినేషన్. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ పండక్కి మీరూ ఓసారి ఈ రెసిపీలను ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా చాలా ఇష్టంగా తింటారు!
సంక్రాంతికి ఈ మూడు పప్పులతో "చెక్కలు" చేయండి - కరకరలాడుతూ నోరూరిస్తాయి!