తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలకు దాదాపు నాలుగేళ్లుగా పరిహారం అందలేదు. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం తెలంగాణ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 5,600 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 690 మంది ఉన్నారు. వీరిలో కౌలు రైతులే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 5,600 మందిలో 1,600 మంది రైతుల కుటుంబాలను ‘రూ.6 లక్షల పరిహారం’ పథకానికి అర్హులుగా ప్రభుత్వం తేల్చింది. దాదాపు 1,300 కుటుంబాలకు పరిహారం అందజేయగా.. మరో 300 కుటుంబాలకు ప్రొసీడింగ్‌లు జారీ చేసింది. అయితే బడ్జెట్ లేదంటూ నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పరిహారం డబ్బులను అందజేయలేదు. బాధితులు పరిహారం కోసం ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారానికి చెందిన ఆన్రెరెడ్డి నర్సిరెడ్డికి సొంతంగా ఎకరం పొలం ఉండగా.. మరో 12 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవారు. వర్షాభావం, ఇతరత్రా కారణాలతో పత్తి పంట ఎండిపోయి దిగుబడి రాకపోవడంతో దాదాపు రూ.5 లక్షల అప్పు చేశారు. అప్పు ఎలా తీర్చాలి, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు ఎలా చేయాలనే మనోవ్యధతో 2015 నవంబరు 7న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం అందించే రూ.6 లక్షలను మంజూరు చేస్తూ.. 2017 మార్చి 30న అప్పటి కలెక్టర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ఇప్పటి వరకూ నర్సిరెడ్డి భార్య విజయకు పరిహారం డబ్బు అందలేదు.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం భైరాంనగరానికి చెందిన గవ్వల యాదగిరికి నాలుగెకరాల పొలం ఉంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టగా కొంత వర్షాభావం, మరికొంత ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయింది. రూ.4.82 లక్షల అప్పు అయింది. దాన్ని తీర్చలేక మనస్తాపంతో ఆయన 2015 అక్టోబరు 12న ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన కుటుంబానికి పరిహారం అందజేయాలని 2015 మే 8న అప్పటి కలెక్టర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులిచ్చినా, యాదగిరి భార్య శ్రీలతకు సొమ్ము అందలేదు.
వివరాలు సేకరిస్తున్నాం..
ప్రొసీడింగ్‌లు వచ్చి ఖాతాల్లో డబ్బులు పడని బాధిత కుటుంబాల వివరాలను సేకరిస్తున్నాం. మరోసారి రికార్డులన్నీ క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన వారి ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ చేస్తాం.-శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
ఇదీ చూడండి: CROP DAMAGE: పంట నష్టం లెక్కింపు, పరిహారం గురించి ప్రస్తావనేదీ?