హైకోర్టు నుంచి వచ్చే ఆదేశాలతో త్వరలోనే పదో తరగతి పరీక్షలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో అర్ధంతరంగా ఆగిపోయాయి. అప్పటికే తెలుగు పేపర్1, పేపర్2, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వివిధ జిల్లాలో తీసుకుంటున్న చర్యలను హైకోర్టుకు నివేదిస్తూ పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 44,108 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందు కోసం గతంలో మొత్తం 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కేంద్రాల సంఖ్య రెట్టింపు కాగా, సూర్యాపేట జిల్లాలో 39.68 శాతం కేంద్రాలు పెరిగాయి. గతంలో ఒక గదిలో 24 మందిని కూర్చోబెట్టగా భౌతిక దూరం పాటించాలనే నిబంధనలతో ఈసారి విద్యార్థులను సగానికి తగ్గించనున్నారు. ఆదర్శ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో గతంలో సగం గదులనే పరీక్షలకు వినియోగించారు. అక్కడ మొత్తం 20 గదులు ఉండటంతో ఈసారి అక్కడ అన్నింటిని వినియోగించనున్నారు.
శుభ్రతపై ప్రత్యేక దృష్టి
పదోతరగతి పరీక్షల నిర్వహణలో విద్యార్థులు, పరీక్షలు నిర్వహించే సిబ్బంది ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులు, ఇన్విజిలెటర్లకు తిరిగి వినియోగించుకునే మాస్క్‌లు ఇవ్వనున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు కేంద్రంలో డెట్టాల్‌తో శుభ్రం చేయనున్నారు. కేంద్రాల్లో విద్యార్థుల కోసం శానిటైజర్‌లు అందుబాటులో ఉంచుతారు.
ముందస్తు చర్యలు తీసుకుంటాం
పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్క్‌లు, శానిటైజర్లు పరీక్షల నిర్వహకులకు అందిస్తాం. పరీక్ష తేదీల ప్రకటన రాగానే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన విద్య, రవాణా, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్, తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు కృషిచేస్తాం.
బి.భిక్షపతి, డీఈవో, నల్గొండ