స్వామీ నృసింహః సకలం నృసింహః అంటూ అంతటా నీవే, అంతా నీవేనయ్యా అని కొలుచుకునే నరసింహస్వామి వెలసిన గుట్టయే నేటి యాదాద్రి. సుక్కలను తాకేటి యాదగిరిగుట్టమీద నరసిమ్మా - యాదగిరీ నరసిమ్మా, సిరిగల్ల మాతల్లి శ్రీలక్ష్మిదేవితోటి - ధరణెల్ల పాలించ కొలువైతివయ్యో నారసిమ్మా అని జానపదులు కూడా పాడుకుంటున్నారంటే ఈ స్థల పురాణం ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్ర స్థల పురాణం ఎంతో మహిమాన్వితం. హిరణ్యకశ్యపుడిని సంహరించిన ఉగ్రనారసింహుడు పలు చోట్ల వెలిసినట్లే యాదగిరి కొండపై ఐదు అవతారాలలో పంచ నారసింహునిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడని పురాణాలసారం.
బీజాక్షర మంత్ర సాకార రూపం
లోక కల్యాణార్థం ఇక్కడే గుహలో వెలసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ముక్తిని ప్రసాదించాలని కోరిన యాదమహర్షి తపమాచరించిన చెట్టు కూడా యాదాద్రి కొండకు దిగువనే మనకు కనిపిస్తుంది. రాగి యంత్రాలపై, రక్షరేకులపై చూసే త్రికోణ ఆకారంలో ఊహిస్తే స్వామివారి బీజాక్షర మంత్రమైన ఓం శ్రీం హ్రీం క్షౌం కి సాకార రూపం ఈ క్షేత్రం. నరసింహస్వామివారు స్వయంభువుడై వెంకటగిరి కొండపై అమూర్త మూర్తిగా ఓ శిలపై వెలిశారు. అందుకే వేంకటగిరి క్షేత్రం ఓంకార క్షేత్రమయింది. అమ్మవారితో కలసి గుర్రంపై వచ్చి నిలిచిన క్షేత్రం పాతగుట్ట. లక్ష్మీనారసింహునిగా పాతగుట్టపై వెలసి శ్రీంకార క్షేత్రంగా ప్రశస్తమైంది. తన భక్తుల బాధలను వినేందుకు కొలువుదీరేందుకు వచ్చి కూర్చున్న దర్బారు కొత్తగుట‌్ట ఆలయంగా హ్రీంకార క్షేత్రమై విలసిల్లింది. ఈ ఓం, శ్రీం, హ్రీం క్షేత్రాల సమ్మిశ్రిత పుణ్యక్షేత్రమే క్షౌం అనే బీజాక్షర దేవుడైన నరసింహ క్షేత్రం.
అణువణువు ఓంకారనాదం
ఈ పరిసరాలు, ఈ కొండలు గుట్టలు మాత్రమే కాదు... నరసింహుని చల్లని చూపు ప్రసరించిన ఈ ప్రాంతంలోని అణువణువు, ప్రతీ ప్రాణి ఆఖరికి చెట్లూ చేమలు కూడా ఓంకారనాదమై పుష్పించాయి. తమ శాఖలకు ఓంకార రూపునిచ్చాయి. వేంకటగిరిపైనే నెలకొన్న ఈ అద్భుత ఓంకార వృక్ష దర్శనం ఓ అనుభూతిమయం. ఇక్కడే నారసింహుని పలు మహిమా విశేషాలు కూడా ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలిచాయి.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం