యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు 300 మంది చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్యతోపాటు, వసతి కల్పించాలనే లక్ష్యంతో ఏడాది క్రితం బాలురు, బాలికల కోసం నూతన వసతి గృహాలు నిర్మించారు. అన్ని వసతులతో, ఆధునిక హంగులతో నిర్మితమైన ఈ భవనాలు ప్రారంభానికి నోచుకోక ఉత్సవ విగ్రహాలుగా మారాయి.
బోరు వేసినా.. నీరు పడలేదు
కోట్లు ఖర్చుపెట్టి కొత్త వసతి గృహాలు నిర్మించారు. నీరు లేదని నిరుపయోగంగా వదిలేశారు. గుట్టల ప్రాంతమైనందున ఇక్కడ బోరు వేసినా నీరు పడలేదు. యాదగిరిగుట్ట పురపాలిక నుంచి వస్తున్న నీరు కళాశాలకే సరిపోవడం లేదు. మిషన్ భగీరథ ద్వారా వసతి గృహాలకు నీరు కావాలంటే పదిహేను లక్షలు చెల్లించాలని ఆ శాఖ పేచీ పెట్టడం వల్ల వసతి గృహాలు నిరుపయోగంగా మారాయి.
స్తోమత లేక
మెకానికల్ ఇంజినీర్ కావాలనే ఆశతో సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి నుంచి యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కళాశాలలో చాలా మంది విద్యార్థులు చేరారు. వసతి గృహం ప్రారంభించకపోవడం వల్ల అద్దె గదుల్లో ఉండే స్తోమత లేక కొందరు ప్రతిరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి వచ్చిపోతూ గంటల తరబడి ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నా.. లేనట్టే...
దూర ప్రాంతాల నుండి ప్రతిరోజు ప్రయాణం చేస్తుండటం వల్ల కళాశాలకు ఆలస్యం అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో బయోమెట్రిక్ సిస్టం ఉండటం వల్ల తాము కళాశాలకు వెళ్లినా.. హాజరు పడడం లేదని వాపోతున్నారు.
స్తోమతకు మించిన భారం
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి కష్టపడి సీటు సాధించి వచ్చిన తాము వసతి సౌకర్యం లేక ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి నెలకు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. స్తోమతకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పందించండి
ఇటీవల కళాశాలకు వెళ్తుండగా.. బస్సు ఎక్కే క్రమంలో బస్సు వెనుక చక్రం కాలుపై నుంచి వెళ్లడంతో ఒక విద్యార్థి గాయమైంది. ఇలాంటివి పునరావృతం కాకుండా.. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : 'రవాణా' సిబ్బంది నియామకానికి ఆర్టీసీ కసరత్తు