నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లాక్డౌన్ కారణంగా బోసిపోయింది. తోపులాటలతో నిండుగా ఉండే దర్శన వరుసలు ఖాళీగా మారాయి. సంతను మరిపించేలా అగుపించే ప్రసాదాల కౌంటర్లు నిర్మానుష్యమయ్యాయి. కరోనాను అరికట్టేందుకు సర్కారు విధించిన లాక్డౌన్ కారణంగా దైవదర్శనాలు, మొక్కు పూజలను నిలిపివేశారు. దీంతో భక్తుల రాక పూర్తిగా తగ్గడం వల్ల రద్దీ ప్రాంగణాలన్నీయు స్తబ్దత రూపం దాల్చాయి. స్వామి వారికి జరిగే పూజలన్నీ ఆంతరంగికమే.
లాక్డౌన్ పొడగింపుతో..
లాక్డౌన్ పొడగింపు కారణంగా దైవ దర్శనాలకు వేసిన తెర ఈ నెల 9 తేదీ వరకు తీయరు. అప్పటి వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించరు. దర్శనాలతో పాటు మొక్కు పూజల నిర్వహణను ఈనెల 9 దాకా నిలిపి వేస్తున్నట్లు శ్రీలక్ష్మీనరసింహ్మ స్వామి దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న తీరులోనే ఆలయ విధులు కొనసాగుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు. భక్తులు లేకుండానే నిత్యారాధనలు కొనసాగిస్తామని ఆలయ పూజారులు, అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి