రైతులంతా సంఘటితంగా నూతన సాగు పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు పొందాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏరువాక కేంద్రం, రైతు సదస్సును ఆమె ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
వ్యవసాయ సదస్సులో అగ్రికల్చర్ విద్యార్థులు ప్రదర్శించిన డెమోను ఎమ్మెల్యే సునీత ఆసక్తిగా తిలకించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా సాగు చేసుకునే మెలకువలు ఈ కార్యక్రమం ద్వారా ప్రదర్శించారు. మంకీగన్ , సమగ్ర, సేంద్రియ వ్యవసాయము వేరు వేరు ప్రాంతాలకు అనువైన వరి వంగడాల గురించి విద్యార్థులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రైతులంతా సంఘంగా ఏర్పడి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు నేర్చుకున్న విషయాలను ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ సందీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం