ఊర్లో ఏదైనా సమస్య ఉందా ఇంకెందుకు ఆలస్యం... ఇదే సరైన పురపాలక ఎన్నికల సమరం. కష్టం చెప్పుకుంటే నేతలు క్షణాల్లో ప్రత్యక్షమైపోతారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలక పరిధిలో నేతలు ఓట్లు కోసం ఫీట్లు మొదలెట్టేశారు. తనా.. మనా అని తేడా లేకుండా అన్నింటా మేమున్నామంటున్నారు. పురపాలక ఎన్నికల ప్రకటన వెలువడక ముందే సేవ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఖర్చుకు వెనకాడరు
పురపాలక పరిధిలోని ఆశావహులు రిజర్వేషన్లు ఎలా ఉన్నా తాము పోటీ చేయాలని కొందరు.. సమస్యలను భూతద్దం పెట్టి వెతికి మరీ వాటిని పరిష్కరిస్తున్నారు. ఇన్నాళ్లు కనిపించని కొందరు సొంత ఖర్చుతో పనులు చేసేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ప్రజాభిమానం చూరగొనేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు.
సమస్య ఏదైనా క్షణంలో స్పందిస్తారు
కొందరు నాయకులు బోర్లు వేయిస్తుంటే ఇంకొందరు, గుంతలుపడిన రోడ్డుకు రాత్రికి రాత్రే మరమ్మతులు చేయిస్తున్నారు. ఇంకొకరు మురుగు నీరు పారేందుకు కాలువలు బాగుచేయిస్తుండగా, ఇంకొకరు యంత్రాలతో తుప్పలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంకొకరైతే విద్యుత్ సిబ్బందితో దగ్గరుండి మరీ వీధి దీపాలు బాగుచేయిస్తున్నారు. ఇలా ఒకటా రెండా సమస్య కనిపిస్తే చాలు మేమంటే మేమంటూ వాటిని పరిష్కరించేందుకు పోటీ పడుతున్నారు.
ఎవరి అవసరం వారిది
గెలుపు మాట అటుంచి వారు చేసే హంగామాతో స్థానికంగా ఎన్నికల సందడి వచ్చింది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ప్రజలు తమ సమస్యలు ఏకరవు పెడుతున్నారు. ఏది ఏమైనా మున్సిపాలిటీ వార్డు విభజన జరిగిన రిజర్వేషన్లు ఖరారు కాకున్నా ఉత్సాహవంతులు తాను ఉన్నాననే సంకేతాలు తెలిపేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
ఇదీ చూడండి: తెరాస క్యాంపు రాజకీయాలు చేస్తోంది: కోమటి రెడ్డి