యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాంపేటకు చెందిన చిలుకూరి రవీందర్‌రెడ్డికి కరోనా సోకడంతో గత నెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి(Private Hospital)లో చేర్పించారు. అక్కడ వైద్యులు 15 రోజుల పాటు చికిత్స అందించి రూ.7 లక్షలు వసూలు చేశారు. నయం కాకపోవడంతో 30న గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించారు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజే ఆయన మృతి చెందారు.
దీనిపై చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం అదనంగా డబ్బులు వసూలు చేసిందని మంత్రి కేటీఆర్(Minister KTR)కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి ఈ వ్యవహారాన్ని చూడమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు(Guvvala Balraju)ను ఆదేశించారు. దీంతో ఆయన, ఎంపీపీ కలిసి గురువారం సదరు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు. రోగి వైద్యానికి న్యాయంగా అయిన ఖర్చులు మినహాయించుకుని అదనంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సూచించారు. అంగీకరించిన యాజమాన్యం రూ.4 లక్షలను మృతుడి సోదరుడు రంగారెడ్డి ఖాతాలో జమ చేశారు. మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపిన 48 గంటల్లోగా స్పందించి మృతుని కుటుంబానికి న్యాయం చేసిన మంత్రి కేటీఆర్‌కు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు ఈ సందర్భంగా ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: RTC problems: తిండి దొరకదు.. నిద్ర పోలేరు.. బస్టాండ్లలో డ్రైవర్లు, కండక్టర్ల కష్టాలు