వ్యర్ధ రసాయనాలను చెరువులు, కుంటల్లోకి వదలడం వల్ల మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రం పరిధిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో నుంచి గతంలో కాలువ గుండా వ్యర్ధ రసాయనాలు బయటకు విడుదల చేయడం వల్ల దాదాపు 8 గేదెలు అస్వస్థతకు గురై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు బొమ్మలరామారం మండల పరిధిలోని నల్లచెరువు గుండా ప్రవహించే వ్యర్ధ రసాయనిక నీరు త్రాగి మరో 13 మేకలు మృతి చెందినట్లు స్థానికుడు శాగంటి బాల్రాజు తెలిపాడు.
గత మూడు రోజుల క్రితం మూడు మేకలు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిపాడు. చెరువు పక్కనే ఉన్న ఓ రసాయనిక పరిశ్రమ దాని పక్కనే ఉన్న కంపెనీలపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రసాయన పరిశ్రమ నుంచి వెలువడిన వివిధ రసాయనాలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి చేరి కలుషితం చేశాయన్నారు. ఆ నీరు తాగి మేకలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు లక్షా 30 వేల రూపాయలు నష్టం జరిగినట్టు బాధితుడు తెలిపాడు. పరిశ్రమల యాజమాన్యం నష్టపరిహారం అందించాలని కోరుతూ బాధితునితో పాటు గ్రామస్థులు కోరారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మధు బాబు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య