ఫాస్టాగ్ విధానం టోల్ ప్లాజాల వద్ద నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం 12 టోల్ గేట్లు ఉండగా హైదరాబాద్ వైపు రెండు, వరంగల్ వైపు రెండు ఫాస్టాగ్ వాహనాల కోసం కేటాయించారు.
మిగిలిన లైన్లు నగదు చెల్లించి వెలుపలికి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. రానున్న రోజుల్లో నగదు ఒక్క దారి గుండానే చెల్లించి వెలుపలికి వెళ్ళేలా, మిగిలినవన్నీ ఫాస్టాగ్ కోసం కేటాయిస్తామని సిబ్బంది పేర్కొన్నారు.
'నగదు చెల్లింపు దారిలో భారీగా బారులు తీరిన వాహనాలు'
ఫాస్టాగ్ తీసుకున్న వాహనదారులు సాఫీగానే టోల్ ప్లాజాను దాటగలుగుతున్నారు. ఫాస్టాగ్ తీసుకోని వాహనదారుల కోసం టోల్ ప్లాజాల వద్ద పరిమిత సంఖ్యలో దారులు కేటాయించారు. నగదు చెల్లించి వెళ్లాల్సిన ఆ దారుల గుండా వాహనాలు భారీగా బారులు తీరాయి. ఫలితంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫాస్టాగ్ తీసుకోని వారికోసం పరిమిత సంఖ్యలో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లైన్లు కేటాయించారు. అయినప్పటికీ వాహనాల వరుస అధికంగా ఉండటం వల్ల చేసేదిలేక అదనపు టోల్ను చెల్లించి వెళ్తున్నారు.
వాహన దారుల కోసం ఫాస్టాగ్ వేయటం కోసం టోల్ ప్లాజా పక్కన ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆదివారం కావడం వల్ల యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గూడూరు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ విధానంతో భారీ సంఖ్యలో వాహన రద్దీ కొనసాగుతోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.