ఆధ్యాత్మిక, ఆహ్లాదకర, సుందర క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం... మరికొద్ది రోజుల్లోనే భక్తులు దర్శించుకునేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే 99 శాతం పనులు పూర్తయ్యాయని యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ... వైస్ ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ఖర్చు రూ. 270 కోట్లు అయిందన్న ఆయన... ఆలయాభివృద్ధి కోసం 1980 ఎకరాల భూ సేకరణకు మరో రూ. 750 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.
స్వయంగా ముఖ్యమంత్రే...
ఆలయ విమాన గోపురానికి రూ. 46 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్న కిషన్‌రావు ఆ పనులపై పునరాలోచనలో ఉన్నట్లు తెలిపారు. 108 అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి రాతి విగ్రహం ఏర్పాటుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఆలయ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని... ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్ స్వామితో సంప్రదించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెల్లడిస్తారని స్పష్టం చేశారు.
సుందర దృశ్యాలు...
నారసింహుని చెంత ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణంతో కూడిన పరిసరాల్ని తయారు చేస్తున్నారు. కొండకు దక్షిణ, పడమటి దిశల్లో వివిధ రకాల పూల మొక్కలతో సుందరవనాలు ఏర్పాటవుతున్నాయి. రాయగిరి నుంచి యాదాద్రి వరకు రహదారి వెంట సుందర దృశ్యాలు సాక్షాత్కరించనున్నాయి.
పనుల పునరుద్ధరణ...
యాత్రికుల వసతుల ప్రాంగణాల కోసం ఆలయ పెద్దగుట్టపై 250 ఎకరాల్లో చేపట్టిన కాటేజీల నిర్మాణాల కోసం లేఔట్ పనులు పూర్తయ్యాయి. కొండ కింద గండిచర్ల ప్రాంగణంలో కల్యాణ కట్ట, వ్రత మండపం, పుష్కరిణితో పాటు బస్ స్టేషన్ నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. కాలినడకన వెళ్లే భక్తుల కోసం మెట్ల దారుల్ని పునరుద్ధరిస్తున్నారు.
అద్వితీయం...
దివ్య విమాన గోపురంపై బంగారు కవచం, రాజగోపురాల స్వర్ణ కలశాలు, గర్భాలయ ద్వారానికి బంగారు కలశాల తొడుగులు లాంటి విశిష్టతలతో యాదాద్రి క్షేత్రం... అద్వితీయంగా రూపుదిద్దుకుంటోంది.